Telugu Global
National

ఆధారాలివ్వండి.. రాహుల్ ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా

పోలీసుల తీరు దారుణమని, అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారని విమర్శించారు రాహుల్. తాను వ్యాఖ్యలు చేసిన 45 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి హడావుడి చేయడమేంటని ప్రశ్నించారు.

ఆధారాలివ్వండి.. రాహుల్ ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా
X

భారత్ లో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయా..? లేదా..? ఆన్ లైన్ లో పోలింగ్ పెడితే 99 శాతం మంది ఔననే చెబుతారు. వారందరి ఇంటికెళ్లి పోలీసులు.. ఆధారాలివ్వండి అంటూ ఎంక్వయిరీ చేస్తారా..? ఏమో, ఢిల్లీ పోలీసులు మాత్రం ఎంక్వయిరీకి సై అంటున్నారు. దాదాపు 45రోజుల క్రితం రాహుల్ గాంధీ జోడో యాత్రలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఆయన్ను వివరణ అడుగుతున్నారు.

రాహుల్ ఏమన్నారు..?

‘దేశంలో మహిళలు ఇంకా లైంగిక వేధింపులకు గురవుతున్నారు’ అంటూ ఆమధ్య కాశ్మీర్ లో జరిగిన జోడో యాత్రలో రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. కానీ 45రోజుల తర్వాత ఆ వ్యాఖ్యలపై విచారణ అంటూ పోలీసులు హడావిడి చేయడం మాత్రం హాస్యాస్పదం. అసలు దేశంలో ఎవరిపై లైంగిక వేధింపులు జరిగాయో చెప్పండి అంటూ పోలీసులు రాహుల్ ని ప్రశ్నించారు. బాధితుల వివరాల ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బాధితుల గురించి రాహుల్ చెప్పడమేంటి, ఆయన ఫిర్యాదు చేయడమేంటి అని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అత్యాచారాలను, లైంగిక దాడులను ఆపడం చేతగాని ప్రభుత్వం, ఆరోపణలు చేసినవారిపై ప్రతాపం చూపించడమేంటని నిలదీశారు కాంగ్రెస్ నేతలు.

ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ సాగర్‌ ప్రీత్‌ హుడా నేతృత్వంలోని ఓ బృందం రాహుల్ ఇంటికి వచ్చి వివరాలు సేకరించింది. పోలీసుల నోటీసుపై 4 పేజీల లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు రాహుల్ గాంధీ. 10 రోజుల్లో పూర్తి వివరాలతో సమాధానం ఇస్తానని పేర్కొన్నారు. పోలీసుల తీరు దారుణమని, అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారని విమర్శించారు. తాను వ్యాఖ్యలు చేసిన 45 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి హడావుడి చేయడమేంటని ప్రశ్నించారు.

పోలీసుల అతికి రాహుల్ తలవంచరు..

పోలీసులు అతి చేస్తున్నారని, కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని, కానీ రాహుల్ తలవంచబోరని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ‘ఆయనను సావర్కార్‌ అనుకుంటున్నారా? ఆయన పేరు రాహుల్‌ గాంధీ ఎవరికీ తలొగ్గరు.’ అంటూ కేంద్రం తీరుపై కాంగ్రెస్‌ ట్విట్టర్లో విమర్శలు చేసింది.

First Published:  20 March 2023 3:33 AM GMT
Next Story