Telugu Global
National

టమాటాల కామెడీ.. కటకటాల వెనక వ్యాపారులు

టమాటా రేట్లను అదుపు చేయడంలోనే కాదు, కనీసం టమాటాలకు రక్షణ కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందంటూ కామెంట్లు వినిపించాయి. దీంతో పోలీసుల్ని రంగంలోకి దించింది యోగి సర్కారు.

టమాటాల కామెడీ.. కటకటాల వెనక వ్యాపారులు
X

టమాటాల రేట్లు భారీగా పెరిగిన తర్వాత దొంగతనాలు ఎక్కువయ్యాయి. పొలాల్లో పంట దగ్గర్నుంచి, మార్కెట్లోకి తెచ్చిన టమాటా బాక్సుల వరకు అన్నిటిపై దొంగల కళ్లు పడ్డాయి, పడిన వెంటనే సరకు మాయమైంది. ఈ దొంగతనాల వ్యవహారాన్ని కాస్త వ్యంగ్యంగా చూపించారు ఉత్తర ప్రదేశ్ లోని వ్యాపారి అజయ్ యాదవ్. కూరగాయల షాపుకి బౌన్సర్ల కాపలా అంటూ తన క్రియేటివిటీ చూపించారు. ఈ క్రియేటివిటీనే ఇప్పుడాయన కొంప ముంచింది. ఆ వ్యాపారితోపాటు, షాపు యజమానులిద్దరిపై పోలీసులు కేసు పెట్టారు.

కేసెందుకు..?

కూరగాయల మార్కెట్ కి బౌన్సర్ల కాపలా అనే వార్తలో వ్యంగ్యం ఉంది కానీ ఎక్కడా ప్రభుత్వంపై విమర్శ లేదు. అయితే ఆ వార్త బయటకు రాగానే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై జోకులు పేలాయి. టమాటా రేట్లను అదుపు చేయడంలోనే కాదు, కనీసం టమాటాలకు రక్షణ కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందంటూ కామెంట్లు వినిపించాయి. దీంతో పోలీసుల్ని రంగంలోకి దించింది యోగి సర్కారు. విషయం ఆరా తీస్తే సదరు వ్యాపారి అజయ్ యాదవ్.. సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త అని తేలింది. ఇంకేముంది తస్మదీయుడికి అరదండాలు వేసేందుకు పోలీసులు మరింత ఉత్సాహం చూపించారు. ఆ షాపు యజమానులైన తండ్రీ కొడుకులు రాజ్ నారాయణ, వికాస్ లను అరెస్ట్ చేశారు. బౌన్సర్లను కాపలా పెట్టిన వ్యాపారి అజయ్ యాదవ్ కోసం గాలిస్తున్నారు.


రాజకీయ సెగలు..

ఈ వ్యవహారాన్ని సమాజ్ వాదీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆరోగ్యకరమైన వ్యంగ్యానికి కూడా ఈ దేశంలో చోటు లేదా అని ప్రశ్నించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. కూరగాయల వ్యాపారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొత్తమ్మీద బౌన్సర్ల వ్యవహారం చివరకు పోలీస్ కేసుల వరకు వచ్చింది.

First Published:  13 July 2023 5:09 AM GMT
Next Story