Telugu Global
National

పోక్సో కేసులో మఠాధిపతిని అరెస్టు చేసిన కర్ణాటక పోలీసులు

కర్నాటక‌లోని మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారును కర్ణాటక లోని చిత్రదుర్గ పోలీసులు అరెస్టు చేశారు.కౌన్సెలింగ్ పేరిట ఈయన తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఇద్దరు విద్యార్థినులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

పోక్సో కేసులో మఠాధిపతిని అరెస్టు చేసిన కర్ణాటక పోలీసులు
X

ఇద్దరు మైనర్ బాలికలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొన్న మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారును కర్ణాటక లోని చిత్రదుర్గ పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిని పోక్సో కేసు కింద అదుపులోకి తీసుకున్నట్టు వారు చెప్పారు. ఈయన మహారాష్ట్రకు వెళ్తుండగా కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. ఈ మఠం 150 కి పైగా ఆధ్యాత్మిక, విద్యా సంస్థలను నిర్వహిస్తున్నది. ఇది నిర్వహిస్తున్న ఓ హాస్టల్ లోని ఇద్దరు హైస్కూలు విద్యార్థినులను శివమూర్తితో బాటు మరో నలుగురు లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఓ ఎన్జీవో సంస్థకు బాధిత విద్యార్థినులు తమ గోడును చెప్పుకోగా ఆ సంస్థ ఫిర్యాదుపై పోలీసులు వీరిమీద పోక్సో కేసు నమోదు చేశారు.

లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఈ మఠాధిపతి కస్టడీ వ్యవహారం సంచలనం రేపింది. లింగాయత్‌ సామాజిక వర్గంలో ఈ మఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామీజీపై కేసు విషయంలో కర్నాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. కౌన్సెలింగ్ పేరిట ఈయన తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఈ విద్యార్థినులు తెలిపారు. అయితే శివమూర్తి శరణారు తప్పేమీ లేదని, ఈ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడతారని రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన యడ్యూరప్ప అంటున్నారు. ఈ మఠాధిపతి మీద వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఆయన అన్నారు. కేసు దర్యాప్తు జరుగుతోంది. అన్ని వాస్తవాలు బయటికొస్తాయి అని ఆయన పేర్కొన్నారు.

కానీ, పోలీసులు శివమూర్తి, హాస్టల్ వార్డెన్ తో బాటు మరో ముగ్గురిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఇందులో ఏదో కుట్ర ఉందని మఠం నిర్వాహకులు అంటున్నప్పటికీ.. వారి వాదనను పోలీసులు కొట్టిపారేశారు. ఈ బాలికలకు న్యాయం జరగాలని, ఈ కేసులోరాజకీయ జోక్యం తగదని రాజ్యసభ ఎంపీ లహార్ సింగ్ సిరోయా వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ కర్ణాటక బయట జరిగినా బాధిత విద్యార్థినులకు న్యాయం జరగాలనే తాము కోరుతున్నామన్నారు. ప్రస్తుతం మైసూరు పోలీసులు కూడా ఈ కేసుపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

First Published:  29 Aug 2022 9:30 AM GMT
Next Story