Telugu Global
National

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూత

కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. హీరాబెన్ మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూత
X

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం ఉదయం ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవలే ఆమె 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు.

తల్లి హీరాబెన్ అనారోగ్యంతో ఉన్నట్లు తెలియడంతో ప్రధాని మోడీ గురువారం అహ్మదాబాద్ చేరుకున్నారు. తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ నెల మొదట్లో గుజరాత్ ఎన్నికల సమయంలో తల్లిని కలిసిన తర్వాత మళ్లీ ఆయన తల్లిని చూడలేదు. హీరాబెన్ గాంధీనగర్ సమీపంలోని రాసన్ అనే గ్రామంలో చిన్న కొడుకు పంకజ్ మోడీతో కలిసి ఉంటున్నారు. ప్రధాని మోడీ తన, తల్లి పుట్టిన రోజు వేడుకలకే కాకుండా.. అప్పడప్పుడు అక్కడకు వెళ్లి కాసేపు గడిపి వచ్చేవారు.

తల్లి మరణించిన తర్వాత మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేశారు. 'ఎంతో విలువైన శతాబ్ద కాలాన్ని ఇక్కడ గడిపి అమ్మ భగవంతుని పాదాల వద్దకు చేరింది. అమ్మలో నేను ఎప్పుడూ మూడు లక్షణాలను గమనించాను. ఒక సన్యాసి లాంటి ప్రయాణం, నిస్వార్థమైన కర్మయోగి లక్షణం, విలువలకు కట్టుబడే జీవనం ఆమె సొంతం. ఆమె తన జీవితాంతం అలాగే జీవించారు' అని భావోద్వేగంగా ట్వీట్ చేశారు.

తల్లి మరణ వార్తను తెలుసుకున్న వెంటనే మోడీ తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయలుదేరారు. ఈ రోజు కోల్‌కతాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాల్సి ఉంది. దాంతో పాటు జాతీయ గంగా కౌన్సిల్‌లో కూడా పాల్గొనాలి. అయితే ఇవి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. పీఎం మోడీ వీడియో కాన్షరెన్స్ ద్వారా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. హీరాబెన్ మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

First Published:  30 Dec 2022 2:09 AM GMT
Next Story