Telugu Global
National

ఫోకస్ బిహార్.. అక్కడ నుంచే మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభం

ప్రధాని మోడీ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా జనవరి, ఫిబ్రవరి నెలల్లో బిహార్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు.

ఫోకస్ బిహార్.. అక్కడ నుంచే మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభం
X

బీజేపీ అగ్ర నాయకత్వం బిహార్ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. అక్కడ ఉన్న లోక్‌సభ స్థానాలన్నింటినీ గెలుచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం బిహార్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారు. ఆయన 'ఇండియా' కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి కన్వీనర్ గా కూడా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. 'ఇండియా' కూటమి ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ను దెబ్బకొట్టేందుకు బీజేపీ పథకం వేస్తోంది. ఆ రాష్ట్రంలో ఉన్న 40 లోక్ సభ స్థానాలను గెలుచుకునేందుకు ప్లాన్ వేస్తోంది.

దేశంలో మరో కొద్దినెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం బిహార్ నుంచే మొదలుపెట్టేలా బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఈనెల 13న ప్రధాని మోడీ బిహార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంపారన్ లోని బెట్టియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ఈ వేదిక నుంచే మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

ప్రధాని మోడీ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా జనవరి, ఫిబ్రవరి నెలల్లో బిహార్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

జనవరి 13న బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్, బెట్టియా, బెగుసరాయ్‌లలో నిర్వహించే మూడు ర్యాలీల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అలాగే 15వ తేదీ కూడా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జనవరి, ఫిబ్రవరి నెలల్లో బిహార్ లో పర్యటించి సీతామర్హి, మాధేపురా, నలంద సభల్లో పాల్గొననున్నారు.

First Published:  7 Jan 2024 12:51 PM GMT
Next Story