Telugu Global
National

మోదీ పుట్టినరోజు జాతీయ నిరుద్యోగ దినం..

మోదీ జన్మదినాన్ని యువత జాతీయ నిరుద్యోగ దినంగా జరుపుకుంటోందని కాంగ్రెస్‌ పేర్కొంది. భారత్ లో నిరుద్యోగత రేటు కరోనాకు ముందే 45 ఏళ్ల గరిష్టానికి చేరిందని గుర్తు చేశారు కాంగ్రెస్ నాయకులు.

మోదీ పుట్టినరోజు జాతీయ నిరుద్యోగ దినం..
X

మోదీ పుట్టిన రోజున బీజేపీ నేతల హడావిడి మామూలుగా లేదు, అటు కాంగ్రెస్ చేస్తున్న భారత్ జోడో యాత్రలో మాత్రం మోదీ పుట్టిన రోజుని జాతీయ నిరుద్యోగ దినంగా జరుపుకున్నారు. రాహుల్ గాంధీ యాత్ర కేరళలోని అలప్పుజ జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా అక్కడి యువత జాతీయ నిరుద్యోగ దినం అని తమ ఒంటిపై రాసుకుని ఆయనకు స్వాగతం పలికారు. పలువురు గ్రాడ్యుయేట్లు, వుయ్ నీడ్ జాబ్స్ అనే ప్లకార్డులు పట్టుకుని రాహుల్ వెంట నడిచారు.

ఎనిమిదేళ్లలో 8 చీతాలు..ఎన్ని ఉద్యోగాలు..?

ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానంటూ ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన మోదీ అసలు ఎంతమందికి ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు. ఎన్డీఏ ఎనిమిదేళ్ల అధికారంలో 8 చీతాలు భారత్ కి వచ్చాయని, కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. ఓవైపు నిరుద్యోగం, మరోవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, జనం కష్టాలపాలవుతుంటే పట్టించుకోవాల్సిన మోదీ.. చీతాలను ఫొటోలు తీయడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. చీతాల విషయంలో మోదీ ఆ స్థాయిలో రియాక్ట్ కావాల్సిన అవసరం లేదన్నారు.


ముగ్గురు చేతిలో దేశం..

దేశంలో చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు, శ్రామికులపై కేంద్రం వ్యవస్థీకృతంగా దాడి చేస్తోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. ముగ్గురు బడా వ్యాపారవేత్తలే దేశ సంపదనంతా నియంత్రిస్తున్నారని చెప్పారు. వారు ఏ వ్యాపారంలోకైనా ప్రవేశించి, అప్పటికే ఉన్నవారిని వెళ్లగొడుతున్నారని, ఉద్యోగాలు దొరక్క యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఓవైపు కోట్లాదిమంది జనం పేదరికంలోకి జారుకుంటుంటే.. మరోవైపు బడా వ్యాపారులు మాత్రం దేశంలో ఓడరేవులు, ఎయిర్‌ పోర్టులు, రోడ్లు, విద్యుత్, వ్యవసాయం వంటి అన్ని రంగాలను సొంతం చేసుకుంటున్నారని విమర్శించారు.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాల చొప్పున 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉండగా ఇప్పటి వరకూ మోదీ ప్రభుత్వం కేవలం 7 లక్షలమందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలిగిందని చెప్పారు రాహుల్ గాంధీ. మిగతావారి పరిస్థితి ఏంటని నిలదీశారు. ''ఉద్యోగాలు సాధించి తీరతామంటూ యువత నినదిస్తోంది. వినిపిస్తోందా?'' అంటూ రాహుల్ ట్వీట్‌ చేశారు. జాతీయ నిరుద్యోగ దినం అంటూ హ్యాష్ టాగ్‌ కూడా జత చేశారు. మోదీ జన్మదినాన్ని యువత జాతీయ నిరుద్యోగ దినంగా జరుపుకుంటోందని కాంగ్రెస్‌ పేర్కొంది. భారత్ లో నిరుద్యోగత రేటు కరోనాకు ముందే 45 ఏళ్ల గరిష్టానికి చేరిందని గుర్తు చేశారు కాంగ్రెస్ నాయకులు. 20–24 ఏళ్ల వయసువారిలో 42 శాతం మంది నిరుద్యోగులేనన్నారు.

First Published:  18 Sep 2022 2:00 AM GMT
Next Story