Telugu Global
National

మోదీకి ట్విట్టర్లో ఘన స్వాగతం.. గెహ్లాత్ వ్యంగ్యాస్త్రం

ఎన్నికల ఏడాదిలో ఆరు నెలల్లో ఆరుసార్లు రాజస్థాన్ కి వచ్చారు ప్రధాని మోదీ. నేడు పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల ప్రారంభోత్సవానికి కూడా రాజస్థాన్ ని ఎంపిక చేసుకున్నారు.

మోదీకి ట్విట్టర్లో ఘన స్వాగతం.. గెహ్లాత్ వ్యంగ్యాస్త్రం
X

ప్రధాని మోదీ అధికారికంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుంటారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలంటే ఆయనకు అమితమైన ప్రేమ. ఎన్నికల ఏడాదిలో నెలకోసారి అయినా వచ్చిపోతుంటారు. శిలా ఫలకాలు, శంకుస్థాపనలతో కోట్లు కుమ్మరిస్తున్నామంటూ ప్రకటనలు ఇస్తుంటారు. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో స్థానిక ప్రభుత్వాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అందులోనూ బీజేపీయేతర పార్టీలు అక్కడ అధికారంలో ఉంటే కనీసం ముఖ్యమంత్రులకు కూడా ప్రయారిటీ ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మోదీ పర్యటన సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కి కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. దానికి ప్రతిగా ఆయన ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీకి స్వాగతం పలికారు. ట్విట్టర్లో వెల్కమ్ చెప్పడం మినహా మీ సభలో పాల్గొని నాలుగు మాటలు మాట్లాడే అవకాశం తనకు లేదని, అశక్తుడనంటూ చతురోక్తులు విసిరారు.


అసలేంజరిగింది..?

ఎన్నికల ఏడాదిలో ఆరు నెలల్లో ఆరుసార్లు రాజస్థాన్ కి వచ్చారు ప్రధాని మోదీ. నేడు పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల ప్రారంభోత్సవానికి కూడా రాజస్థాన్ ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాజస్థాన్ సీఎం అశోగ్ గెహ్లాత్ ని కూడా ఆహ్వానించారు. కానీ ఆయనకు ప్రసంగించే అవకాశం లేకుండా చేశారు. ముందుగా 3 నిమిషాలు సమయం కేటాయించినా, ఆ తర్వాత షెడ్యూల్ మార్చారు, గెహ్లాత్ ప్రసంగాన్ని ఎత్తివేశారు. దీనిపై సీఎం గెహ్లాత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని తొలగించారని, ఇక తాను ట్విట్టర్లో మాత్రమే ప్రధానికి స్వాగతం పలకగలనని చెప్పారు. ప్రత్యేకంగా ట్వీట్ చేస్తూ.. అందులోనే తన డిమాండ్లు పొందుపరిచారు.

పీఎంఓ వివరణ..

గెహ్లాత్‌ ట్వీట్‌ కలకలం రేపడంతో ప్రధాని కార్యాలయం స్పందించింది. ప్రొటోకాల్ ప్రకారం సీఎం గెహ్లాత్ ని ప్రధాని కార్యక్రమానికి ఆహ్వానించామని, ఆయన ప్రసంగానికి సమయం కూడా కేటాయించామన్నారు పీఎంఓ అధికారులు. అయితే ఆ కార్యక్రమానికి రాలేనని సీఎం కార్యాలయం బదులిచ్చిందని, అందుకే ప్రసంగాన్ని తొలగించామని వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గెహ్లాత్ ని ఆహ్వానిస్తున్నామని, అంతే కాకుండా.. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై కూడా ఆయన పేరు ఉంటుందన్నారు పీఎంఓ అధికారులు.

First Published:  27 July 2023 5:52 AM GMT
Next Story