Telugu Global
National

సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది.. మోదీజీ జోక్ చేశారా..?

సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. స్వేచ్ఛ అంటే ప్రతిపక్షాలపై కేసులు నమోదు చేయడమేనా అని ప్రశ్నిస్తున్నాయి.

సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది.. మోదీజీ జోక్ చేశారా..?
X

1963, ఏప్రిల్‌ 1న ప్రారంభమైన కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ.. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (CBI) 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. డైమండ్ జూబ్లీ వేడుకలు ఢిల్లీలో జరిగాయి. ఈ వేడుకలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. షిల్లాంగ్‌, పుణె, నాగ్‌ పూర్‌ లో కొత్తగా ఏర్పాటు చేసిన సీబీఐ కాంప్లెక్స్‌ లను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ప్రెసిడెంట్స్‌ పోలీస్‌ మెడల్‌ తో పాటు ఉత్తమ దర్యాప్తు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించి పోస్టల్ స్టాంపు, నాణెం విడుదల చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగమే ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది.


స్వేచ్ఛగా..

2014 తర్వాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందంటూ కితాబిచ్చారు ప్రధాని మోదీ. అంతకు ముందు కాంగ్రెస్ సీబీఐని పంజరంలో చిలకను చేసిందని, తమ ప్రభుత్వ హయాంలో సీబీఐకి స్వేచ్ఛను ప్రసాదించామన్నారు. 2014లో తాము అవినీతిపై యుద్ధం ప్రారంభించామని, అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర అన్నారు. ఇప్పుడు అవినీతిపరులు సీబీఐని చూసి భయపడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు అవినీతిని వ్యవస్థీకృతం చేశాయన్నారు.

సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. స్వేచ్ఛ అంటే ప్రతిపక్షాలపై కేసులు నమోదు చేయడమేనా అని ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి 2014 తర్వాతే సీబీఐ పూర్తిగా కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని, ప్రభుత్వాలు కూలగొట్టాలన్నా, ముఖ్య నాయకుల్ని బెదిరించి బీజేపీలోకి లాక్కోవాలన్నా కేంద్రం దగ్గర ఉన్న ప్రధాన అస్త్రం సీబీఐ అని విమర్శిస్తున్నారు. దర్యాప్తు సంస్థకు మంచి పేరు ఉండొచ్చు కానీ, దాన్ని కేంద్రం ఇప్పుడు ప్రతీకారాలకోసం వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెను దుమారమే రేగింది. సీబీఐతోపాటు ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను కూడా బీజేపీ తన స్వప్రయోజనాలకోసం వాడుకుంటోందని మండిపడుతున్నారు నెటిజన్లు.

First Published:  3 April 2023 4:16 PM GMT
Next Story