Telugu Global
National

అది తిరంగా పాయింట్.. ఇది 'శివశక్తి' ప్రాంతం

ఇకనుంచి ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. అంతరిక్ష విజ్ఞానంతో మరెన్నో ఫలితాలు అందుకోవాలన్నారు మోదీ.

అది తిరంగా పాయింట్.. ఇది శివశక్తి ప్రాంతం
X

చంద్రయాన్-3 విజయం తర్వాత బెంగళూరు వచ్చి ఇస్రో శాస్త్రవేత్తలను కలిశారు ప్రధాని నరేంద్రమోదీ. పనిలో పనిగా రెండు నామకరణ కార్యక్రమాలను పూర్తి చేశారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన ప్రాంతాన్ని 'శివశక్తి' అనే ప్రాంతంగా పిలుచుకుందామన్నారు. 2019లో చంద్రయాన్‌-2 క్రాష్‌ ల్యాండ్‌ అయిన ప్రదేశానికి 'తిరంగా పాయింట్‌' అని ఇకపై పిలుద్దామని చెప్పారు. శివ అనే పదాన్ని మనం శుభంగా భావిస్తామని, దేశంలోని నారీ మణుల గురించి మాట్లాడే సమయంలో శక్తి అనే పదాన్ని వాడుతామని.. అందుకే మన విజయానికి 'శివశక్తి' అనే పేరు పెట్టామని వివరించారు మోదీ.

‘మేకిన్‌ ఇండియా’ ఇప్పుడు చంద్రుడి వరకు సాగిందని చెప్పుకొచ్చారు మోదీ. మంగళ్‌ యాన్‌, చంద్రయాన్‌ విజయాల స్ఫూర్తిని కొనసాగిద్దామన్నారు. అదే స్ఫూర్తితో గగన్‌ యాన్‌ కు సిద్ధమవుదామని చెప్పారు. ఇకనుంచి ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. అంతరిక్ష విజ్ఞానంతో మరెన్నో ఫలితాలు అందుకోవాలన్నారు మోదీ.


కర్నాటక సీఎంతో పేచీ..

మరోవైపు ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య హాజరు కాలేదు. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఈ కార్యక్రమానికి పిలవలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తనకంటే ముందు కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంతో మోదీ ఇబ్బంది పడ్డారని, అందుకే ఆయన ప్రొటోకాల్‌ కు విరుద్ధంగా.. వారిద్దరిని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. వారిని కనీసం ఎయిర్‌ పోర్టుకు రాకుండా ఆపేశారని విమర్శించారు. దీనిపై కూడా మోదీ వివరణ ఇవ్వడం విశేషం. బెంగళూరుకు తాను ఏ సమయంలో చేరుకుంటానో కచ్చితంగా తెలియదని, అందుకే ప్రొటోకాల్ విషయంలో ఎవర్నీ ఇబ్బంది పెట్ట దలచుకోలేదన్నారు మోదీ.


First Published:  26 Aug 2023 10:32 AM GMT
Next Story