Telugu Global
National

చరిత్రను వక్రీకరించడంలో, అసత్యమాడటంలో మీకు మీరే సాటి మోదీ

మోదీ భారత నౌకా దళానికి కొత్త పతాకను లేదా చిహ్నాన్ని ఆవిష్కరించారు. దాని వెనక ఛత్రపతి శివాజీ స్ఫూర్తి ఉంది. దానికీ సంతోషించవలసిందే. కానీ ఆ సందర్భంలో శివాజీని ప్రస్తుతించడానికి మోదీ చెప్పిన మాటలు కనీసం అర్థ సత్యాలు కూడా కావు. పూర్తిగా అసత్యాలే.

చరిత్రను వక్రీకరించడంలో, అసత్యమాడటంలో మీకు మీరే సాటి మోదీ
X

చరిత్రను వక్రీకరించడంలో, అసత్యమాడడంలో మోదీని మించిన వారు ఉండరేమో. ప్రతి అంశానికీ ఆయన హిందుత్వ రంగు పులమగలరు. నాలుగు రోజుల కింద ప్రధానమంత్రి మోదీ ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ ను జల ప్రవేశం చేయించారు. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ నౌక కావడం గర్వకారణమే. ఈ సందర్భంగా మోదీ భారత నౌకా దళానికి కొత్త పతాకను లేదా చిహ్నాన్ని ఆవిష్కరించారు. దాని వెనక ఛత్రపతి శివాజీ స్ఫూర్తి ఉంది. దానికీ సంతోషించవలసిందే. కానీ ఆ సందర్భంలో శివాజీని ప్రస్తుతించడానికి మోదీ చెప్పిన మాటలు కనీసం అర్థ సత్యాలు కూడా కావు. పూర్తిగా అసత్యాలే.

శివాజీ నిర్మించిన నౌకా దళాన్ని చూసి వలసవాదులు జడుసుకున్నారని మోదీ అన్నారు. వాస్తవానికి శివాజీ నౌకా దళానికి ఐరోపా వారిని భయపెట్టగలిగిన శక్తే లేదు. బ్రిటిష్ వారి దగ్గర అప్పటికి ఉన్న నౌకా దళం మరాఠా నౌకా దళం కన్నా చాలా బలీయమైంది.

శివాజీ సేనకు తమ బలాబలాలు బాగా తెలుసు. అందుకే వారు సముద్రం లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ఒడ్డుకు దగ్గరలో ఉన్న విదేశీ నౌకా దళం మీద దొంగ దెబ్బ తీసి వచ్చేవారు. ఐరోపా వారి యుద్ధ నౌకలు అప్పటికే చాలా భారీవి. సముద్రంలో అఖాతాలు, కయ్యలు ఎక్కడ ఉన్నాయో శివాజీ సేనకు తెలుసుకనుక దాడి చేసి సులభంగా వెనక్కు వచ్చే వారు. ఐరోపా యుద్ధ నౌకలు అంత ఇరుకు ప్రాంతంలోకి చొరబడలేనంత పెద్దవి కనుక శివాజీకి గెరిల్లా దాడి చేసి రావడం సులభమయ్యేది. అప్పటికి శివాజీ ఎదుర్కోవాల్సి వచ్చింది కేవలం ఐరోపా వారినే కాదు. మొగలులను, ఆఫ్రికా జాతీయులైన సిద్దీలతో కూడా తలపడవలసి వచ్చేది. శివాజీ ఏలుబడి సాగిన రోజుల నాటికే బ్రిటిష్ నౌకా దళం బొంబాయిలో తిష్ట‌ వేసి ఉండేది. మధ్యమధ్యలో శివాజీ బలగాలతో తలపడేది. 1679 లోనే బ్రిటిష్ వారు బొంబాయికి దగ్గరలోని ఖందేరీ దీవిని స్వాధీనం చేసుకున్నారు. శివాజీ ఈ దాడిని తిప్పికొట్టడానికి ప్రయత్నించినప్పుడు బ్రిటిష్ వారు ఆ దీవిని దిగ్బంధం చేశారు. ఆ తరవాత 1680 లో శివాజీకి, బ్రిటిష్ వారికి మధ్య సంధి కుదిరింది.

శివాజీ గొప్ప యోధుడు కావచ్చు. కానీ హిందుత్వ సిద్ధాంతాన్ని ముందుకు తోయడానికి బీజేపీ ఆయనను గొప్ప హిందూ పరిరక్షకుడిగా చిత్రించడానికి ప్రయత్నిస్తుంది. నిజానికి శివాజీకి మత భేదాలు ఉండేవి కావు. ఆయన సేనా నాయకుల్లో ఒకరు ముస్లిం అయిన దౌలత్ ఖాన్. మరొకరు మై నాయక్ భండారీ. శివాజీ గొప్ప సైన్యాధిపతి అని చెప్పడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఆయన ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇచ్చేవారు. ఈ పద్ధతి మన రాజులకు అంతకు ముందు లేదు. శివాజీ సైన్యంలో దౌలత్ ఖాన్ మాత్రమే కాకుండా కనీసం మరో డజను మంది ముస్లిం కమాండర్లు ఉండేవారు. ఈ వాస్తవం ప్రస్తుత హిందుత్వ వాదులకు మింగుడు పడదు.

శివాజీ నౌకా దళం తీర రక్షక దళం లాంటిది. మన తీర రక్షక దళానికి మూలాలు శివాజీలో వెతకడంలో తప్పు లేక పోవచ్చు. కానీ శివాజీ భారత నౌకాదళానికి ఆద్యుడు అని మోదీ చేస్తున్న వాదన కేవలం హిందుత్వ మార్కు దబాయింపు మాత్రమే.

భారత నౌకా దళానికి మూలాలు బొంబాయిలో తిష్ట‌ వేసిన బ్రిటీష్ నౌకా దళంలోనే కనిపిస్తాయి. మొదట దాన్ని బొంబాయి నావికా దళం అనేవారు. హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం సంపాదించడానికి బ్రిటీష్ వారికి తోడ్పడింది ఈ నౌకా దళమే. ఈ నౌకా దళాన్ని 1798లో బొంబాయి నావికా దళం అనే వారు. 19వ శతాబ్దంలో, కచ్చితంగా చెప్పాలంటే 1830 బొంబాయి నౌకా దళం అన్నారు. 1830లో భారత నౌకా దళం అనే వారు. 1878లో రాయల్ ఇండియన్ మరైన్స్ అంటే తరవాత అదే రాయల్ ఇండియన్ నౌకా దళంగా తరవాత భారత నౌకా దళంగా మారింది. ఈ క్రమాన్ని పరిశీలిస్తే భారత నౌకా దళ మూలాలు శివాజీ పాలనలో కాగడా పెట్టి వెతికినా కనిపించవు.

బ్రిటీష్ వారి భారత సేనలు భారత్ ను ఆక్రమించాయి. బ్రిటీష్ వారు రావడానికి ముందు అనేక చిన చిన్న రాజ్యాలు ఉండేవి. పరస్పరం కలహించుకునేవి. కొందరు రాజులు బ్రిటీష్ ప్రాబల్యం పెరగడానికి సహకరించారు కూడా. భారత జాతీయ పోరాటంలో ఇసుమంత పాత్ర కూడా లేని బీజేపీకి తమ దేశభక్తి చాటుకోవడానికి శివాజీని ఆశ్రయించవలసి వస్తోంది. ఇదే బీజేపీ రాజేంద్ర చోళుడి పాత్రను విస్మరిస్తుంది.

చోళుల విజయాలు శివాజీ విజయాలకన్నా మహత్తరమైనవి. చోళులు బంగాళ ఖాతం నుంచి వచ్చి శ్రీవిజయ రాజ్యాన్ని ధ్వంసం చేశారు. జావా, సుమత్రా, థాయ్ లాండ్, మలేషియాను సైతం స్వాధీనం చేసుకున్నారు. చోళుల పాలన శతాబ్దాల పాటు కొనసాగింది. నౌకా దళం పాత్ర ఎప్పుడూ ఆక్రమణ స్థితిలోనే ఉంటుంది. శివాజీ నావికా దళంలాగా ఆత్మ రక్షణకే పరిమితం కావడం ఒక రకంగా బలహీనతే. వేదాలు, బౌద్ధ జాతక కథలు, సంస్కృత, పాళీ సాహిత్యాన్ని పరిశీలిస్తే భారత నావికా సంప్రదాయం అత్యంత ప్రాచీనమైంది. అది శివాజీతో ప్రారంభమైంది అనడం మోదీ లాంటి చరిత్రను వక్రీకరించే వారికే సాధ్యం.

హరప్పా, మొహంజోదారో నాగరికతలో గణనీయమైన నౌకా దళాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, కొంకణి, గుజరాతీ, సింధీ, మలయాళం, ఒరియా సాహిత్యంలో మన నౌకా దళ ఆనవాళ్లు కనిపిస్తాయి. చైనా, అరబ్, పర్షియన్ సాహిత్యమూ ఇదే చెప్తుంది.

First Published:  6 Sep 2022 7:39 AM GMT
Next Story