Telugu Global
National

కాంగ్రెస్ తిట్లు లెక్కబెట్టుకుంటున్న మోదీ..

కాంగ్రెస్ నేతలు తనను ఎన్నిసార్లు తిట్టినా తాను అవేం పట్టించుకోనని, ప్రజల కోసం మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు మోదీ.

కాంగ్రెస్ తిట్లు లెక్కబెట్టుకుంటున్న మోదీ..
X

వైరివర్గాలు తిడితే నాయకులెవరైనా వెంటనే కౌంటర్ ఇస్తారు. ప్రధాని మోదీ కౌంటర్ ఇవ్వడంతోపాటు వాటిని లెక్కబెట్టుకుంటున్నారు కూడా. అవును, తనను ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఎన్నిసార్లు తిట్టాయో లెక్క తప్పకుండా చెబుతున్నారు ప్రధాని మోదీ. ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు ఆయన్ను 91సార్లు తిట్టారట. తాజాగా మల్లికార్జున్ ఖర్గే తనపై చేసిన విషసర్పం వ్యాఖ్యల్ని కూడా ఈ కౌంట్ లో కలుపుకున్నారు. ఇప్పటి వరకు 91సార్లు తనను కాంగ్రెస్ నేతలు తిట్టారని అంటున్నారు మోదీ.

కర్నాటక బీదర్ జిల్లా హుమ్నాబాద్‌ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి హాజరైన మోదీ, తనని కాంగ్రెస్ నేతలు ఎన్నిసార్లు తిట్టారనే విషయాన్ని ప్రజలకు చెప్పారు. ప్రధాని మోదీ విష సర్పం, తాకితే ఖతం అంటూ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలను మోదీ ప్రస్తావించారు. తనను తిట్టినప్పుడల్లా ప్రజలు కాంగ్రెస్‌ ను చిత్తుగా ఓడిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీని మరోసారి గెలిపించాలని, కర్నాటక రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు మోదీ.

కాంగ్రెస్ నేతలు తనను ఎన్నిసార్లు తిట్టినా తాను అవేం పట్టించుకోనని, ప్రజల కోసం మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు మోదీ. అలాగే తనను తిట్టిన ప్రతిసారి కాంగ్రెస్ ఘోర పరాభవం చవిచూస్తోందని సెటైర్లు వేశారు.

బీజేపీలో వణుకు..

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగాల్సి ఉంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కి మెజార్టీ సీట్లు వస్తాయని, ఇటీవల సర్వేలు తేల్చి చెబుతున్నాయి. హంగ్ కి కూడా అవకాశం లేదని, కాంగ్రెస్ క్లీన్ విక్టరీ సాధిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో బీజేపీలో కంగారు మొదలైంది. ఇప్పటినుంచే జేడీఎస్ ని మంచి చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా కర్నాటక ప్రచారంలో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్ తిడితే అది తమ పార్టీకే మంచిదని చెప్పుకొచ్చారు.

First Published:  29 April 2023 11:43 AM GMT
Next Story