Telugu Global
National

ఎర్రకోట వేదికగా తప్పు ఒప్పుకున్న మోదీ..

బీజేపీ ప్రభుత్వ పనితీరు చూసి 2019లో ప్రజలు రెండోసారి ఆశీర్వదించారని, ముచ్చటగా మూడోసారి కూడా ఆశీర్వదిస్తే, తాను మళ్లీ ప్రధాని అవుతానని చెప్పారు మోదీ. దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు వచ్చే ఐదేళ్లు చాలా కీలకం అన్నారాయన.

ఎర్రకోట వేదికగా తప్పు ఒప్పుకున్న మోదీ..
X

2022నాటికి దేశంలోని పేదలందరికీ ఇళ్లు..

రైతులందరి ఆదాయం రెట్టింపు

ఇంటింటికీ మంచినీటి సరఫరా..

గతంలో మోదీ ఇచ్చిన హామీలివి. వాటి అమలు ఏమైందంటూ ప్రతిపక్షాలు నిలదీసినా దులిపేసుకున్నారు కానీ కనీసం స్పందించలేదు. మళ్లీ ఇప్పుడు కొత్త స్కీమ్ అంటూ కొత్త వాగ్దానాలు మొదలుపెట్టారాయన. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం మోదీ ఈ కొత్త స్కీమ్ వివరాలు ప్రకటించారు.


పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా నూతన పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని మోదీ. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చేలా కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి లక్షల్లో ప్రయోజనం కల్పించేలా ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

పాతవి మరచిపొండి.. కొత్తవి వినండి

ఎన్నికల వేళ మోదీ మళ్లీ కొత్త హామీలతో ప్రజల ముందుకొస్తున్నారనే విషయం స్పష్టమైంది. పేదలకు ఇళ్లు అనే హామీని సరికొత్తగా మళ్లీ తెరపైకి తెచ్చిన ఆయన.. విశ్వకర్మ జయంతి సందర్భంగా సంప్రదాయ కళాకారులకు చేయూతనందించేందుకు వీలుగా విశ్వకర్మ యోజన పేరుతో కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల నుంచి ప్రారంభించబోయే ఈ పథకానికి తొలి విడతగా రూ.13వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10వేల నుంచి 25వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు మోదీ.

బీజేపీ ప్రభుత్వ పనితీరు చూసి 2019లో ప్రజలు రెండోసారి ఆశీర్వదించారని, ముచ్చటగా మూడోసారి కూడా ఆశీర్వదిస్తే, తాను మళ్లీ ప్రధానిని అవుతానని చెప్పారు మోదీ. దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు వచ్చే ఐదేళ్లు చాలా కీలకం అన్నారాయన. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిష్కృతం కావాలని ఆకాంక్షించారు. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని, వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం ప్రపంచంలో భారత్ ఐదో ఆర్థికశక్తిగా ఉందని, అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని.. దానికి తానే గ్యారెంటీ అని అన్నారు మోదీ.

మణిపూర్ పై పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నెత్తీనోరు మొత్తుకున్నా కరగని మోదీ, చివరకు అవిశ్వాస తీర్మానంపై స్పందిస్తూ రెండు ముక్కలు మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం రోజున మరోసారి మణిపూర్ అంశాన్ని తెరపైకి తెచ్చారాయన. మణిపూర్‌ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, మన తల్లులు, సోదరీమణులు అకృత్యాలను చవిచూశారని చెప్పారు. మణిపూర్ లో క్రమంగా శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయని.. ఆ రాష్ట్ర ప్రజలకు దేశమంతా అండగా నిలవాలన్నారు మోదీ.

First Published:  15 Aug 2023 8:19 AM GMT
Next Story