Telugu Global
National

పీఎం కిసాన్.. 8కోట్ల మందికి కోత

ఈ పథకం ప్రారంభమైనప్పుడు తొలి ఏడాది లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్లు. ఈ ఏడాది జూన్ లో పీఎం కిసాన్ ఆర్థిక సాయం అందుకున్న లబ్ధిదారుల సంఖ్య కేవలం 3.87 కోట్లు మాత్రమే.

పీఎం కిసాన్.. 8కోట్ల మందికి కోత
X

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం లబ్ధిదారులు ఏడాదికేడాది భారీగా తగ్గిపోతున్నారు. ఆరంభంలో రైతులందరికీ సాయం అందిస్తామంటూ ప్రచారం చేసుకున్న కేంద్రం, చివరకు లబ్ధిదారుల సంఖ్యను తెగ్గోస్తోంది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. నాలుగు నెలలకోసారి 2వేల చొప్పున మొత్తం మూడు విడతల్లో ఏడాదికి 6వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తుంది కేంద్రం. పథకం ప్రారంభమైనప్పుడు తొలి ఏడాది లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్లు. ఈ ఏడాది జూన్ లో పీఎం కిసాన్ ఆర్థిక సాయం అందుకున్న లబ్ధిదారుల సంఖ్య కేవలం 3.87 కోట్లు మాత్రమే. అంటే, దాదాపు 8 కోట్ల మంది రైతులను ఈ జాబితా నుంచి తొలగించింది కేంద్రం.

ఆర్టీఐ ద్వారా నిజాలు వెలుగులోకి..

ఇవేవో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కావు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ ఇచ్చిన సమాధానం. పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే లబ్ధిదారుల సంఖ్య 67 శాతం మేర తగ్గిపోవడానికి మాత్రం కారణాలు చెప్పలేకపోయింది.

ఏపీలో లబ్ధిదారుల సంఖ్య 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు తగ్గిపోయింది. మహారాష్ట్రలో 1.09 కోట్ల నుంచి 37.51 లక్షలకు తగ్గింది. గుజరాత్‌ లో 63.13 లక్షల నుంచి 28.41 లక్షలకు రైతుల సంఖ్య తగ్గించేశారు. దేశంలోని రైతుల్లో రెండొంతుల మందికి కూడా ఆర్థిక సాయం అందకపోతే ఇక ఆ పథకానికి అర్థమేముందని ప్రశ్నిస్తున్నారు ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ నేతలు. ఈ పథకాన్ని పూర్తిగా కనుమరుగు చేసేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ కేంద్రం ఆమేరకు భారాన్ని తగ్గించుకుంటోందని మండిపడ్డారు.

First Published:  21 Nov 2022 4:09 AM GMT
Next Story