Telugu Global
National

భారత్ జోడో యాత్రపై కేరళ హైకోర్టులో కేసు

భారత్ జోడో యాత్ర వల్ల ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ యాత్రను నియత్రించాలని కె.విజయన్ అనే న్యాయవాది కోర్టును కోరారు.

భారత్ జోడో యాత్రపై కేరళ హైకోర్టులో కేసు
X

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్రను నియంత్రించాలని ఓ న్యాయవాది కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ యాత్ర వల్ల ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతోందని న్యాయవాది కె విజయన్ ఆరోపించారు.

భారత్ జోడో యాత్ర ప్రారంభమై 13 రోజులైంది. సెప్టెంబర్ 11న కేరళలో ప్రవేశించింది. ఈ యాత్ర కేరళలో మరో 8 రోజులు సాగుతుంది.

ఈ యాత్ర‌ వల్ల గంటల తరబడి జాతీయ రహదారిని మూసివేస్తున్నారని, దీంతో రోజువారీ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని విజయన్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. యాత్రను నియంత్రించడానికి ఆదేశాలు జారీ చేయాలని, రహదారిలో సగం మాత్రమే ర్యాలీ సాగేట్టుగా అనుమతి ఇవ్వాలని, తద్వారా మరొక వైపు ట్రాఫిక్ స్వేచ్ఛగా వెళ్లడానికి వీలు కలుగుతుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. .

యాత్ర భద్రతా ఏర్పాట్లకు భారీ ఖర్చులు అవుతున్నాయని, వందలాది మంది పోలీసులను రోడ్లపై మోహరిస్తున్నారని పేర్కొంటూ, పన్ను చెల్లింపుదారుల డబ్బును దీని కోసం ఖర్చుపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ బిల్లులు వసూలు చేయాలని పిటిషనర్ విజయన్ కోర్టును కోరారు.

ఈ యాత్ర కేరళ ప్రజా రోడ్డు రవాణా చట్టం 2011ని ఉల్లంఘిస్తోందని కూడా విజయన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.

అయితే తాము ముందస్తు అనుమతి తీసుకునే యాత్ర సాగిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేష్ అన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, భద్రతా కారణాల వల్ల కొన్ని చోట్ల పోలీసులు రోడ్లను బ్లాక్ చేస్తున్నారని ఆయన తెలిపారు. రాబోయే 157 రోజుల్లో యాత్ర సాగే మొత్తం 12 రాష్ట్రాలు, 2 యూటీలలో పార్టీ ముందస్తు అనుమతి తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

First Published:  21 Sep 2022 6:19 AM GMT
Next Story