Telugu Global
National

ఇకపై మీటింగుల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్లు నిషేధం..

సచివాలయంలో కూడా ఇకపై అన్నీ సాఫ్ట్ కాపీలే ఉండాలంటూ సీఎస్ ఉత్తర్వులిచ్చారు. హార్డ్ కాపీల పేరుతో పేపర్లు వేస్ట్ చేయొద్దని, పర్యావరణానికి నష్టం చేయొద్దని సూచించారు.

ఇకపై మీటింగుల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్లు నిషేధం..
X

సీఎం, మంత్రులు, అధికారుల సమావేశాల్లో ఇకపై ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు ఇవ్వరు. అంతగా కావాలంటే స్టీల్ గ్లాస్ లో అడిగినవారికి మాత్రమే తెచ్చి ఇస్తారు. అజెండా కాపీలను ఇష్టం వచ్చినట్టు ప్రింట్ తీసి అందరికీ పంచిపెట్టరు. మెయిల్ ఐడీకి సాఫ్ట్ కాపీ పంపించాం డౌన్ లోడ్ చేసుకుని చదువుకోండి అని మాత్రమే చెబుతారు. అత్యవసరమైన ఫైల్స్ కి కూడా ప్లాస్టిక్ రేపర్లు తొడిగి హంగామా చేయరు, స్పైరల్ బైండింగ్ పూర్తిగా నిషిద్ధం. మరీ తప్పదు అంటే పేపర్ కి రెండువైపులా ప్రింట్ తీయాల్సిందే.. తాజాగా యూపీ సర్కారు తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు ఇవి. ఈమేరకు ఉత్తర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. అది కూడా సాఫ్ట్ కాపీ ద్వారానే.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని లెక్చర్లు దంచే వారంతా, గొంతు తడి ఆరిపోగానే తిరిగి ప్లాస్టిక్ బాటిల్ లో నీరుకోసం వెదుక్కుంటారు. గ్లోబల్ వార్మింగ్ పై పుంఖాను పుంఖాలుగా మాట్లాడేవారు కూడా అలసిపోయి రూమ్ లోకి వెళ్లి వెంటనే ఏసీ ఆన్ చేస్తారు. ఇలాంటివి సహజం. కానీ మాటలు చేతలవరకు రావాల్సిందేనంటూ ఇటీవల యూపీలోని యోగి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తొలివేటు ప్లాస్టిక్ బాటిళ్లపై వేసింది. వాస్తవానికి 2022 జులై నుంచి భారత్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. కానీ అది ఎక్కడా అమలులోకి రాలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతగా వాటికి మినహాయింపులిచ్చుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు యోగి సరికొత్త ప్రయోగం చేశారు. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

అన్నీ సాఫ్ట్ కాపీలే..

సచివాలయంలో కూడా ఇకపై అన్నీ సాఫ్ట్ కాపీలే ఉండాలంటూ సీఎస్ ఉత్తర్వులిచ్చారు. హార్డ్ కాపీల పేరుతో పేపర్లు వేస్ట్ చేయొద్దని, పర్యావరణానికి నష్టం చేయొద్దని సూచించారు. అత్యవసరమైతేనే ప్రింటర్ జోలికి వెళ్లాలని ఆదేశాలిచ్చారు. గతంలో కూడా చాలా రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నాయి. అయితే ఎక్కడా ఏవీ అమలైన దాఖలాలు లేవు. యూపీ ఆలోచన అయినా ఆచరణలోకి వస్తుందో లేదో చూడాలి.

First Published:  1 March 2023 7:18 AM GMT
Next Story