Telugu Global
National

పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గబోతున్నాయా..? కేంద్రం ఏం చెప్పిందంటే..?

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గించి మిడిల్ క్లాస్ ఓట్లకు గేలమేయడం ఖాయమనే వాదన కూడా వినపడింది. వీటన్నిటిపై ఈరోజు కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గబోతున్నాయా..? కేంద్రం ఏం చెప్పిందంటే..?
X

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గబోతున్నాయనే వార్త కొన్నిరోజులుగా హాట్ టాపిక్ గా మారింది. పెట్రోల్ బంకులు కూడా ఎక్కువ నిల్వలు పెట్టుకోవడంలేదని, ఏ క్షణం అయినా రేట్ల తగ్గింపుపై ప్రకటన వెలువడుతుందనే పుకార్లు షికార్లు చేశాయి. ఎన్నికలొస్తున్నాయంటే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా గ్యాస్ రేట్లు తగ్గిస్తామనే హామీ కామన్ గా కనపడుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గించి మిడిల్ క్లాస్ ఓట్లకు గేలమేయడం ఖాయమనే వాదన కూడా వినపడింది. వీటన్నిటిపై ఈరోజు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రేట్ల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాజనితం అని చెప్పారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి.

చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలు జరగలేదని అన్నారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా కూడా భారత్ లో ఎందుకు తగ్గించడంలేదనే విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ మార్కెట్‌ లో ఇప్పటికిప్పుడు చమురు ధరలు తగ్గినా.. తీవ్రమైన ఒడుదొడుకులను ఎవరూ అంచనా వేయలేరని చెప్పారాయన. ఇలాంటి స్థితిలో ఏ ప్రభుత్వానికయినా చమురు ధరలు తగ్గించడం కష్టంతో కూడుకున్న వ్యవహారమన్నారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లాభాలు ప్రకటించినప్పటికీ.. చమురు ధరలు గరిష్టంగా ఉన్న సమయంలో రిఫైనరీలు భారీ నష్టాలు చవిచూశాయని ఆయన గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు రేట్లు తగ్గించడంలేదని, ఆ దిశగా చర్చలు జరగలేదని చెప్పారు.

అంతిమ నష్టం వినియోగదారుడిదే..

రిఫైనరీలకు గతంలో నష్టం వచ్చింది, ఇప్పుడు లాభాలు వస్తున్నాయన్న కారణంతో రేట్లు తగ్గించలేమంటున్న కేంద్ర మంత్రి.. అంతిమంగా వినియోగదారుడి జేబుకే చిల్లుపడుతోందన్న వాస్తవాన్ని ఒప్పుకున్నట్టయింది. రిఫైనరీ కంపెనీలపై కేంద్రానికి ప్రేమ ఉంది కానీ, వినియోగదారుడు అధిక రేట్లు ఎందుకు చెల్లించాలన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానమివ్వలేదు. మొత్తానికి కేంద్రం ఎన్నికల టైమ్ లో కూడా ప్రజలపై దయచూపే అవకాశం లేదని తేలిపోయింది. బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నాయంటున్న సర్వేలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో వెలువడిన ఆశాజనక ఫలితాలు.. వెరసి బీజేపీని మరింత కఠినంగా మార్చేశాయి. ఒక్కోసారి ఇలాంటి అతి విశ్వాసమే కొంప ముంచే అవకాశముందని అంటున్నారు విశ్లేషకులు.

First Published:  3 Jan 2024 10:52 AM GMT
Next Story