Telugu Global
National

జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయండి.. సుప్రీం కోర్టులో పిటిషన్

పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, అందుకోసం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది మహేష్ కుమార్ తివారీ తాజాగా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.

జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయండి.. సుప్రీం కోర్టులో పిటిషన్
X

స్త్రీలకు కల్పించినట్లే తమకు కూడా హక్కులు కల్పించాలంటూ ఇటీవల మహిళా బాధిత పురుషులు నిరసనలు ప్రదర్శించడం తరచూ కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట బెంగళూరులో వందలాది మంది పురుషులు రోడ్ల మీదకొచ్చి మహిళా అనుకూల చట్టాలను మార్చాలని నిరసన ర్యాలీలు చేపట్టారు. తాజాగా జాతీయ పురుషుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. వివాహమైన పురుషులు గృహహింసకు గురవుతున్నారని, ఈ కారణంగా పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మహిళా బాధిత పురుషుల కోసం తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, అందుకోసం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది మహేష్ కుమార్ తివారీ తాజాగా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ నేర గణాంక సంస్థ వివరాల ప్రకారం 2021లో 1,18,979 మంది పురుషులు ఆత్మహత్య చేసుకోగా 45, 026 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. పురుషుల్లో 4.8 శాతం మంది వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యల వల్లే ఆత్మహత్యలకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

గృహ హింస బాధిత పురుషుల ఫిర్యాదులను స్వీకరించి విచారణ నిర్వహించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. మహిళా బాధిత పురుషుల సమస్యల పరిష్కారం కోసం చట్టాలు అమలులోకి వచ్చేలోగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించాలని విజ్ఞ‌ప్తి చేశారు. పెళ్లయిన మహిళల ఫిర్యాదులను పోలీసులు స్వీకరిస్తున్నారని, అయితే వారు పురుషుల సమస్యలపై కూడా ఫిర్యాదులు స్వీకరించేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఈ పిటిషన్ కోరారు.

First Published:  15 March 2023 12:57 PM GMT
Next Story