Telugu Global
National

కోడి పందాల స్థానంలో కుక్కల ఫైటింగ్.. పెటా ఆందోళన

కుక్కల జాతి ఆధారంగా పోటీలు ఉంటాయి. కేవలం పోరాటాల కోసమే పిట్ బుల్ జాతి కుక్కల్ని పెంచుతుంటారు. పోరాటంలో ప్రత్యర్థికి చిక్కకుండా ఉండేందుకు వాటి చెవులు కత్తిరిస్తారు.

కోడి పందాల స్థానంలో కుక్కల ఫైటింగ్.. పెటా ఆందోళన
X

కోడిపందాలు అందరికీ తెలుసు. గోదావరి జిల్లాల్లో పెద్ద పెద్ద మైదానాలు సిద్ధం చేసి మరీ కోళ్లను రంగంలోకి దింపుతారు. నిషేధం ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇలాగే కుక్కల పందాలు కూడా జరుగుతాయని అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. అవును, ఈ పందాలు ఇప్పుడు భారత్ లో బాగా ఫేమస్ అవుతున్నాయి. డాగ్ ఫైట్ పేరుతో కుక్కలను కేవలం పోరాటాల కోసమే పెంచుతుంటారు కొంతమంది. అయితే ఇవి ఎక్కడా ప్రచారంలోకి రావడంలేదు. చాటుమాటుగా, గుట్టుచప్పుడు కాకుండా డాగ్ ఫైట్స్ జరుగుతున్నాయి. వీటిపై పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌ మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ (పెటా) ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అక్రమంగా నిర్వహిస్తున్న డాగ్ ఫైటింగ్స్ ని, చట్ట విరుద్ధమైన పెంపుడు జంతువుల దుకాణాలు (పెట్ షాప్స్), పెంపకందారులను అడ్డుకోవాలని పెటా కోరింది. ఈ మేరకు కేంద్ర పశుసంవర్ధక శాఖ, భారత జంతు సంక్షేమ మండలికి లేఖలు రాసింది. డాగ్ ఫైట్స్ కారణంగా తీవ్రంగా గాయపడిన కొన్ని కుక్కల వీడియోలు కూడా పెటా విడుదల చేసింది. కాక్ ఫైట్ ప్లేస్ లో ఇప్పుడు డాగ్ ఫైట్ బాగా విస్తరిస్తోందని, దీన్ని ముందుగానే అరికట్టాలని కోరింది పెటా.

డాగ్ ఫైట్ పై క్రేజ్..

కుక్కల పోటీలంటే ఇప్పటి వరకూ అందాల పోటీలనే అందరికీ తెలుసు. అందంగా ముస్తాబైన కుక్కలతో క్యాట్ వాక్ చేయించి వాటికి బహుమతులు ఇస్తుంటారు. అయితే డాగ్ ఫైట్ మరో తరహా పోటీలు. కోడి పందాల్లాగా కుక్కలతో ఫైట్ చేయిస్తారు. బతికున్న దానికి బహుమతి ఇస్తారు. ఇటీవల డాగ్ ఫైట్ క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోంది. కుక్కల జాతి ఆధారంగా పోటీలు ఉంటాయి. కేవలం పోరాటాలకోసమే పిట్ బుల్ జాతి కుక్కల్ని పెంచుతుంటారు. పోరాటంలో ప్రత్యర్థికి చిక్కకుండా ఉండేందుకు వాటి చెవులు కత్తిరిస్తారు. ఈ డాగ్‌ ఫైటర్లు రహస్య ప్రదేశాలను ఎంపిక చేసుకొని పోటీలు నిర్వహిస్తుంటారు, పెద్ద మొద్దంలో డబ్బులు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం-1960 ప్రకారం కుక్కలను పోరాటాల కోసం ప్రేరేపించడం చట్టవిరుద్ధం అని పెటా సభ్యులు అంటున్నారు.

First Published:  14 Sep 2022 3:38 AM GMT
Next Story