Telugu Global
National

కేజ్రీవాల్ కాన్వాయ్ లో ఆటోలు.. ఇదో రకం వెటకారం..

బీజేపీ నేతలు వెటకారం చేయబోతే, సోషల్ మీడియాలో అది రివర్స్ అయింది. ఆటోలను, తమ వృత్తిని అవమానించారంటూ ఆటో డ్రైవర్లు కౌంటర్లు ఇస్తున్నారు. కేజ్రీవాల్ ఆటోలో ప్రయాణిస్తే తప్పేంటని అంటున్నారు.

కేజ్రీవాల్ కాన్వాయ్ లో ఆటోలు.. ఇదో రకం వెటకారం..
X

కేజ్రీవాల్ తో వెటకారం ఆడాలని చూసి సోషల్ మీడియాకి బుక్కయ్యారు బీజేపీ నేతలు. ఢిల్లీ బీజేపీ నేతల వెటకారానికి సోషల్ మీడియాలో ఓరేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. ఆటోలంటే అంత చులకనైపోయాయా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆటోవాలాల జోలికొస్తే బీజేపీకి గుణపాఠం చెబుతామంటున్నారు.

అసలేం జరిగింది..?

ఇటీవల గుజరాత్‌ లో పర్యటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఆటో డ్రైవర్ కోరిక మేరకు అతని ఇంటికి వెళ్లి భోజనం చేశారు. ఈ క్రమంలో హోటల్ గది నుంచి అతని ఆటోలోనే వారి ఇంటికెళ్లారు, ఆతిథ్యం స్వీకరించారు. ఢిల్లీ వచ్చినప్పుడు కచ్చితంగా తమ ఇంటికి రావాలని సీఎం ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆహ్వానించారు. ఆటోలో కేజ్రీవాల్ హోటల్ నుంచి బయలుదేరే సమయంలో గుజరాత్ పోలీసులు అడ్డు చెప్పారు. ప్రొటోకాల్ కి విరుద్ధమన్నారు. కానీ కేజ్రీవాల్ వినలేదు. పట్టుబట్టి ఆటోలోనే వెళ్లారు. దీనిపై ఇప్పుడు బీజేపీ రాద్ధాంతం చేస్తోంది. అదంతా ఓ పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేసిన ఢిల్లీ బీజేపీ నేతలు కేజ్రీవాల్ కి ఐదు ఆటోలు గిఫ్ట్ గా పంపించారు.

ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇంటికి 5 ఆటోలను తీసుకొచ్చారు బీజేపీ నేతలు. గుజరాత్ లో ఆటోలో ప్రయాణించిన కేజ్రీవాల్ ఢిల్లీలో కూడా ఆటోల్లోనే ప్రయాణించాలంటున్నారు. ఆయన అభిరుచికి తగ్గట్టుగానే తాము ఐదు ఆటోలను బహుమతిగా తెచ్చామన్నారు. ఇందులో ఒక ఆటో పైలట్‌ గా పనిచేస్తుందని, ఇంకొకదాంట్లో కేజ్రీవాల్ ప్రయాణించవచ్చని, మరో రెండు ఆటోలు భద్రతా సిబ్బంది కోసం అని, ఐదో ఆటో ఆయన సెక్రటరీల కోసం అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాన్వాయ్ లో 27 కార్లు, 200మంది భద్రతా సిబ్బంది ఉన్న కేజ్రీవాల్, గుజరాత్ లో ఆటోలో ప్రయాణించడమేంటని ప్రశ్నించారు బీజేపీ నేతలు.

సీన్ రివర్స్..

బీజేపీ నేతలు వెటకారం చేయబోతే, సోషల్ మీడియాలో అది రివర్స్ అయింది. ఆటోలను, తమ వృత్తిని అవమానించారంటూ ఆటో డ్రైవర్లు కౌంటర్లు ఇస్తున్నారు. కేజ్రీవాల్ ఆటోలో ప్రయాణిస్తే తప్పేంటని అంటున్నారు. ఆటోలు ఆయనకు గిఫ్ట్ గా ఇవ్వడం తమని అవమానించడమేనంటున్నారు. తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పకపోతే బీజేపీ నేతలకు గుణపాఠం చెబుతామంటున్నారు. మరి దీనికి బీజేపీ నేతలు ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

First Published:  16 Sep 2022 3:09 AM GMT
Next Story