Telugu Global
National

'పెగాసస్' విచారణ కు ప్రభుత్వం సహకరించ లేదన్న సుప్రీంకోర్టు

పెగాసస్ స్పై వేర్ కేసులో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని సుప్రీం కోర్టు తెలిపింది. దీనిపై తాము నియమించిన కమిటీ ఐదు మొబైల్ ఫోన్లలో ఈ మాల్వేర్ ను గుర్తించినట్టు 'సుప్రీం' తేల్చి చెప్పింది.

పెగాసస్ విచారణ కు ప్రభుత్వం సహకరించ లేదన్న సుప్రీంకోర్టు
X

మిలటరీ-గ్రేడ్ ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్ ను కేంద్ర ప్రభుత్వం వినియోగించిందా లేదా అని దర్యాప్తు చేసిన కమిటీకి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని సుప్రీం కోర్టు చెప్పింది. కమిటీకి సమర్పించిన 29 మొబైల్ ఫోన్లలో ఐదింట్లో 'మాల్వేర్'ను కనుగొన్నట్లు గురువారం నాడు సుప్రీంకోర్టు పేర్కొంది.

దేశంలో ప్రభుత్వాన్ని విమర్శించే మేదావులు, ఆక్టివిస్టులు, జర్నలిస్టుల ఫోన్లలో అక్రమంగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ను ప్రవేశ‌పెట్టి వారి వాట్సప్ చాట్ ల పై కేంద్ర ప్రభుత్వం నిఘాపెట్టిందనే ఆరోపణలపై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు గతంలో ఓ కమిటీ నియమించింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి రవీంద్రన్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటి జూన్ లో తన రిపోర్టును సుప్రీం కోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరిగింది. ఛీఫ్ జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ లు సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం జరిపిన ఈ విచారణ సందర్భంగా, కేంద్రం సహకరించకపోవడాన్ని ఎత్తి చూపుతూ ఎన్వీ రమణ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి ''మీరు సుప్రీం కోర్టులో తీసుకున్న స్టాండ్ నే విచారణ కమిటీ ముందు కూడా ప్రదర్శించారు'' అని వ్యాఖ్యానించారు.

గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో పెగాసస్ పై వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తుందో లేదో సమాధానం చెప్పలేమని, ఇది ఉగ్రవాదులను అప్రమత్తం చేస్తుందని, జాతీయ భద్రతకు ముప్పు వస్తుందని ఎస్‌జి మెహతా అన్నారు. అదే విషయాన్ని సీజేఐ ఈ రోజు గుర్తు చేశారు.

కమిటీ ఈ నివేదికను మూడు భాగాలుగా సమర్పించిట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందులో టెక్నికల్ కమిటీ యొక్క రెండు నివేదికలు, సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వి రవీంద్రన్ పర్యవేక్షణ కమిటీ యొక్క ఒక నివేదిక ఉన్నాయి.

నివేదికలోని ఒక భాగాన్ని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పబ్లిక్‌గా ఉంచుతామని సుప్రీం కోర్టు పేర్కొంది. ''సిఫార్సులపై జస్టిస్ రవీంద్రన్ నివేదికలోని మూడవ భాగాన్ని మా వెబ్‌సైట్‌లో పబ్లిక్‌గా ఉంచుతాము'' అని CJI తెలిపారు, పూర్తి నివేదికను పబ్లిక్ డొమైన్‌లో ప్రచురించవద్దని కమిటీ కోరింది అని ఆయన అన్నారు.

పిటిషనర్లలో కొందరు నివేదికలోని మొదటి రెండు భాగాల కాపీని కూడా కోరారు. వారి డిమాండ్‌ను కోర్టు పరిశీలిస్తుందని సీజేఐ తెలిపారు.

అనంతరం ఈ కేసు నాలుగు వారాల పాటు వాయిదా పడింది.

Next Story