Telugu Global
National

త‌ట‌స్థ పార్టీలు 11.. వాటి ఎంపీలు 91..

ప్ర‌స్తుతం బీఆర్ఎస్ ఎన్డీఏ, ఇండియా కూట‌ములు రెండింటికీ దూరంగా ఉంది. వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్ తరచూ పార్లమెంటులో బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నాయి.

త‌ట‌స్థ పార్టీలు 11.. వాటి ఎంపీలు 91..
X

దేశంలో రానున్న 2024 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల‌ను అధికార‌, విప‌క్ష పార్టీలు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌రానికి సై అంటున్నాయి. విప‌క్ష కూట‌మి `ఇండియా` 26 పార్టీల‌తో, అధికార ప‌క్ష కూట‌మి ఎన్డీఏ 38 పార్టీల‌తో పోటీకి రెడీ అవుతున్నాయి. విప‌క్ష పార్టీలు ప‌లు భేటీల అనంత‌రం ఒక కూటమిగా ఏర్ప‌డ్డాయి. బీజేపీని ఓడించ‌డ‌మే ఏకైక ల‌క్ష్యంగా ఈ కూట‌మి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఇక ఈ రెండు ప‌క్షాల‌కూ దూరంగా 11 పార్టీలు ప్ర‌స్తుతానికి త‌ట‌స్థంగా ఉన్నాయి. వాటిలో వైఎస్సార్‌సీపీ, బీఆర్ఎస్‌, బిజూ జనతాదళ్, బీఎస్పీ, మజ్లిస్, టీడీపీ, శిరోమణి అకాలీదళ్, ఏఐయూడీఎఫ్, జనతాదళ్ (ఎస్), ఆర్ఎల్పీ, శిరోమణి అకాలీదళ్ (మాన్) ఉన్నాయి. ఈ 11 పార్టీలకు క‌లిపి మొత్తం 91 మంది ఎంపీలు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇందులో ఏపీలోని వైఎస్సార్‌సీపీ, టీడీపీ, తెలంగాణ‌లోని బీఆర్ఎస్‌, ఒడిశాలోని బిజూ జ‌న‌తాద‌ళ్ ప్ర‌ధాన‌మైన‌వి. ఈ మూడు రాష్ట్రాల్లో 63 ఎంపీ సీట్లు ఉన్నాయి.

ఇక తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే. బీజేపీకి వ్య‌తిరేక కూట‌మి క‌ట్టాల‌ని కూడా ఆ పార్టీ ఈ ఏడాది ప్రారంభంలో ప్ర‌య‌త్నాలు చేసింది. పార్టీని సింగిల్‌గానే విస్తృతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌స్తుతం ఆ పార్టీ ఎన్డీఏ, ఇండియా కూట‌ములు రెండింటికీ దూరంగా ఉంది. వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్ తరచూ పార్లమెంటులో బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నాయి.

ఇక టీడీపీ విష‌యానికొస్తే.. 2014లో బీజేపీ, జ‌న‌సేన పొత్తు వ‌ల్ల లాభ‌ప‌డి అధికారాన్ని చేజిక్కించుకున్న విష‌యం తెలిసింది. ఆ త‌ర్వాత బీజేపీకి దూర‌మై.. ఆ పార్టీపై, ప్ర‌ధాని మోడీపై చంద్ర‌బాబు అనేక సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో చంద్ర‌బాబు వైఖ‌రి అర్థం చేసుకున్న‌ బీజేపీ నేత‌లు టీడీపీని పూర్తిగా దూరం పెట్టేశారు. ఇక రానున్న 2024 ఎన్నిక‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఒంట‌రిగా ఎదుర్కోవ‌డమంటే ఆత్మ‌హ‌త్యాస‌దృశమేన‌ని అర్థం చేసుకున్న చంద్ర‌బాబు.. మ‌రోసారి జ‌న‌సేన‌, బీజేపీతో క‌లిసి పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతానికి జ‌న‌సేన చంద్ర‌బాబు వెంటే ఉన్నా.. బీజేపీ మాత్రం టీడీపీని పూర్తిగా దూరం పెట్టేసింది.

మ‌రోప‌క్క రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోపిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వ్యతిరేక గళమెత్తాలని ఆ పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. తమను అంటరాని పార్టీగా చూస్తున్నారని ఆరోపిస్తూ మజ్లిస్ అధినేత ఒవైసీ ఇండియా కూటమికి దూరంగా ఉన్నారు. ఈ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, కర్ణాటకల్లో ప్రభావం చూపే అవకాశముంది.


2024 ఎన్నిక‌ల్లో `ఇండియా - ఎన్డీయే` కూట‌ముల్లో ఏదైనా మెజార్టీ స్థానాలు గెలుచుకుంటే స‌రే.. లేదంటే ఈ త‌ట‌స్థ పార్టీల‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉండ‌నుంది. ఏ కూట‌మి అధికారం చేప‌ట్టాల‌న్నా.. వీరి మ‌ద్ద‌తు కంప‌ల్స‌రీ. ప్ర‌స్తుతానికి ఏ కూట‌మికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌ని ఈ 11 త‌ట‌స్థ పార్టీలు.. ఎన్నిక‌లకు ఇంకా స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో వారి స్టాండ్‌ను మార్చుకుంటాయా..? ఎన్డీయే ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే ప‌రోక్షంగా వైఎస్సార్ సీపీ, బిజూ జనతాదళ్ లాంటి పార్టీలు మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల‌ ఫ‌లితాల అనంత‌రం ఆయా రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకొని ఏ కూట‌మికి మ‌ద్ద‌తు ఇవ్వాలని నిర్ణ‌యించుకుంటాయో వేచి చూడాలి.

First Published:  20 July 2023 6:26 AM GMT
Next Story