Telugu Global
National

ఎల్లుండి నుంచి పార్ల‌మెంటు స‌మావేశాలు.. అస్త్ర‌శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటున్న విప‌క్షాలు

జూలై 18 నుంచి ప్రారంభంకానున్న‌పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు వాడిగా వేడిగా జ‌ర‌గ‌నున్నాయి. ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాల‌పై విప‌క్షాలు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

ఎల్లుండి నుంచి పార్ల‌మెంటు స‌మావేశాలు.. అస్త్ర‌శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటున్న విప‌క్షాలు
X

జూలై 18 నుంచి ప్రారంభంకానున్న‌పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు వాడిగా వేడిగా జ‌ర‌గ‌నున్నాయి. ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాల‌పై విప‌క్షాలు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ద్ర‌వ్యోల్బ‌ణం, ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల‌, విద్వేష పూరిత వ్యాఖ్య‌లు వంటి అంశాల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని విప‌క్షాలు భావిస్తున్నాయి. ప్ర‌ధానంగా అన్ పార్ల‌మెంట‌రీ పేరుతో చ‌ట్ట స‌భ‌ల్లో కొన్ని ప‌దాల‌ను వాడ‌రాదంటూ ఆంక్ష‌లు, పార్ల‌మెంటు వెలుప‌లా లోప‌లా కూడా ఎటువంటి నిర‌స‌న‌లు, నిర‌శ‌న‌లు, ధ‌ర్నాలు వంటివి చేప‌ట్ట‌కూడ‌దంటూ బులిటెన్లు విడుద‌ల చేయ‌డం పై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

దేశంలో తొలిసారిగా డిజిట‌ల్ మీడియా పై ఆంక్ష‌లు విధించ‌డాన్ని విప‌క్షాలు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నాయి. ప్ర‌జాస్వామ్యానికి ఇటువంటి నిర్ణ‌యాలు గొడ్డ‌లిపెట్టు వంటివ‌ని వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు సంకెళ్ళు వేయ‌డ‌మేనంటూ ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తుతున్నాయి.

పైగా జాతీయ చిహ్నం రూపురేఖ‌ల‌ను మార్చి దూకుడు, దాడి స్వ‌భావంతో కోర‌లు గ‌ల సింహాల‌ను రూపొందించి దానిని ఆవిష్క‌రించ‌డం ప‌ట్ల కూడా విక్షాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌శాంత చిత్తంతో అహింస‌కు ప్ర‌తిరూపంగా హుందాగా ఉన్న సింహం ముఖాల‌ను మార్పులు చేయ‌డం ఏమిట‌ని విప‌క్ష స‌భ్యులు ప్ర‌శ్నిస్తున్నారు . బ‌హుశా మార్చిన చిహ్నం మోడీ మార్క్ పాల‌న‌కు ప్ర‌తీక అని ఎద్దేవా చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ విష‌యం కూడా పార్ల‌మెంటును కుదిపేయొచ్చ‌ని భావిస్తున్నారు.

ఈ ప‌రిస్థితుల నేపథ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల స‌భ్యులు ఆదివారంనాడు ఢిల్లీలో స‌మావేశం కానున్నారు. పార్ల‌మెంటు స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహం పై చ‌ర్చించి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని చూస్తున్నారు. ఈ స‌మావేశానికి టిఆర్ఎస్ అధినేత,తెలంగాణ ముఖ్య‌మంత్రి కూడా హాజ‌ర‌వుతార‌ని భావిస్తున్నారు. స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బిజెపికి జాతీయ స్థాయిలో ప్ర‌త్యామ్నాయంగా మ‌రింత శ‌క్తివంత‌మైన కూట‌మిని ఏర్పాటు చేయాల‌ని కేసిఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న బీజేపీయేత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఇత‌ర ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందుగానే విప‌క్ష కూట‌మిని ఏర్ప‌ర్చి ఎన్నిక‌ల నాటికి బ‌లోపేతం చేయాల‌ని కెసిఆర్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ఇందుకోసం ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు త‌దిత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పాటు ఇత‌ర విప‌క్ష పార్టీ ప్ర‌ముఖుల‌తో కూడా ప‌లు ద‌ఫాలు చ‌ర్చించారు. పార్ల‌మెంటు వేదిక‌గా బిజెపీ కి వ్య‌తిరేకంగా స‌మ‌ర‌శంఖం పూరించేందుకు ఒక ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌ని, విప‌క్షాల‌తో చ‌ర్చించి దానికి తుది రూపు ఇస్తార‌ని అంటున్నారు.

ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల , బిజెపి అధికార ప్రతినిధి ప‌ద‌వినుంచి స‌స్పెండైన నూపుర్ శర్మ వ్యవహారంతో సహా ఇటీవలి ద్వేషపూరిత ప్రసంగాల వంటి సంఘటనలతో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని కాంగ్రెస్ స‌హా విప‌క్ష స‌భ్యులు సిద్ధ‌మ‌వుతున్నారు.

వ‌ర్షాకాల స‌మావేశాల్లో 24 బిల్లులు

సోమ‌వారంనుంచి ప్రారంభ‌మ‌య్యే పార్ల‌మెంటు స‌మావేశాల్లో కంటోన్మెంట్ బిల్లు, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, దివాలా కోడ్ (సవరణ) బిల్లు (ఇన్సాల్వెన్సీ & బాంక‌ర‌ప్సీ ), తెలంగాణ‌లో కేంద్ర గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం సహా 24 బిల్లులను ప్ర‌భుత్వం ప్రవేశపెట్టనుంది. వీటిలో ప్ర‌ధానంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ మీడియాను నియంత్రించే లక్ష్యంతో రూపొందించిన బిల్లు కూడా ఉంది.

First Published:  16 July 2022 9:07 AM GMT
Next Story