Telugu Global
National

ఈరోజు నుంచి పార్లమెంట్.. రేపే బడ్జెట్

ఈసారి సమావేశాలు రెండు విడతల్లో జరుగుతాయి. తొలి విడత ఈరోజు నుంచి మొదలై ఫిబ్రవరి 14 వరకు, ఆ తర్వాత మార్చి 12న మొదలై ఏప్రిల్‌ 6వతేదీ వరకు రెండో సెషన్ ఉంటుంది.

ఈరోజు నుంచి పార్లమెంట్.. రేపే బడ్జెట్
X

2024 సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చివరిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ఆర్థిక మందగమన సంకేతాలందుతున్న వేళ ఈ బడ్జెట్ లో మెరుపులేవీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో సామాన్యులపై ఆర్థిక భారం మోపే నిర్ణయాలుంటే మాత్రం కచ్చితంగా అది బీజేపీకి తీరని నష్టం కలిగించే అవకాశముంది. అందుకే ఆచితూచి బడ్జెట్ రెడీ చేసిన బీజేపీ సర్కారు 2023-24 పద్దుని ఫిబ్రవరి-1న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడానికి కసరత్తులు పూర్తి చేసింది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అవుతాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. ఆమె ఉపన్యాసం అనంతరం.. సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్‌ లో ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ సహా మరికొన్ని పార్టీలు బాయ్ కాట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి-1 బుధవారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాజ్యసభ, లోక్‌ సభలో దీనిపై ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. ఈసారి సమావేశాలు రెండు విడతల్లో జరుగుతాయి. తొలి విడత ఈరోజు నుంచి మొదలై ఫిబ్రవరి 14 వరకు, ఆ తర్వాత మార్చి 12న మొదలై ఏప్రిల్‌ 6వతేదీ వరకు రెండో సెషన్ ఉంటుంది.

కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా..

ఈసారి కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టేలా ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనా సరిహద్దు వివాదం, పాలనలో గవర్నర్ల జోక్యం, గౌతమ్‌ అదానీ షేర్లపై హిండెన్‌ బర్గ్‌ నివేదిక, జాతీయస్థాయి కుల గణన, మహిళా రిజర్వేషన్‌ బిల్లు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు రెడీగా ఉన్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా బీజేపీ పలాయనం చిత్తగిస్తుందా లేక సమాధానాలిస్తుందా అనేది వేచిచూడాలి. ఈ సారి సమావేశాల్లో 36 బిల్లులు పార్లమెంట్‌ ముందుకు వస్తున్నాయి.

First Published:  31 Jan 2023 12:26 AM GMT
Next Story