Telugu Global
National

పారాసెట్మాల్ కి మళ్లీ పెరిగిన డిమాండ్.. ఈసారి ఎందుకంటే..?

నెలరోజుల వ్యవధిలో దాదాపు 3కోట్ల రూపాయల పారాసెట్మాల్ ట్యాబ్లెట్లు అమ్ముడుపోయాయి. మెడికల్ షాపుల్లో స్టాకు నిండుకోవడంతో ఆన్ లైన్లో ఆర్డర్లు ఇచ్చి మరీ తెప్పించుకుంటున్నారట.

పారాసెట్మాల్ కి మళ్లీ పెరిగిన డిమాండ్.. ఈసారి ఎందుకంటే..?
X


కరోనా కాలంలో పారాసెట్మాల్ ట్యాబ్లెట్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. అవసరం ఉన్నా లేకున్నా చాలామంది ట్యాబ్లెట్ షీట్లు కొని ఇంట్లో పెట్టుకున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అప్పట్లో ఆయా కంపెనీల ఆదాయం రికార్డులకెక్కింది. తాజాగా మళ్లీ పారాసెట్మాల్ కి డిమాండ్ పెరిగింది. అయితే ఈసారి కరోనా కాదు, వైరల్ ఫీవర్స్ కారణం.

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వైరల్ ఫీవర్స్ తో ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య పెరిగింది. డెంగీ, టైఫాయిడ్, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లో పూర్తిగా కొన్ని జిల్లాలు మంచం పట్టాయి. మొరాదాబాద్ లో దాదాపు ప్రతి ఇంటిలో ఒకరిద్దరు బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ జిల్లా ఇప్పుడు పారాసెట్మాల్ అమ్మకాల్లో రికార్డులు సృష్టించింది. నెలరోజుల వ్యవధిలో దాదాపు 3కోట్ల రూపాయల పారాసెట్మాల్ ట్యాబ్లెట్లు అమ్ముడుపోయాయి. మెడికల్ షాపుల్లో స్టాకు నిండుకోవడంతో ఆన్ లైన్లో ఆర్డర్లు ఇచ్చి మరీ తెప్పించుకుంటున్నారట.ఇక యాంటీబయోటిక్ మెడిసిన్, ప్లేట్లెట్ల సంఖ్యను పెంచే ఔషధాలుగా పేరున్న మరికొన్ని మందులకు కూడా యూపీలో భారీగా డిమాండ్ పెరిగిందట.

డబుల్ ఇంజిన్ సర్కార్ ఘనత ఇదేనా..?

పారాసెట్మాల్ అమ్మకాల్లో రికార్డుల సంగతేమో కానీ ఇప్పుడు యోగీ సర్కారుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మొరాదాబాద్ జిల్లా జ్వరపీడితులతో ఇబ్బంది పడుతుంటే డబుల్ ఇంజిన సర్కారు ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. జ్వరాలు రాకుండా ఎవరూ అరికట్టలేరు, కానీ ఇలా జిల్లా మొత్తం జ్వరాలబారిన పడితే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం ఎందుకు విఫలమైందంటూ విమర్శలు చేస్తున్నారు. మొత్తమ్మీద పారాసెట్మాల్ అమ్మకాల వ్యవహారం యోగీ సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపుతోంది.

First Published:  14 Nov 2022 10:43 AM GMT
Next Story