Telugu Global
National

ప్రభుత్వ కార్యాలయంలో బయటపడ్డ నోట్ల కట్టలు, బంగారం.. సీజ్ చేసిన పోలీసులు

యోజనా భవన్‌లోని బేస్మెంట్ ప్రాంతాన్ని ఎక్కువగా ఆధార్ విభాగానికి చెందిన సిబ్బంది ఉపయోగిస్తుంటారు. దీంతో పోలీసులు ఆ విభాగానికి చెందిన ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బేస్మెంట్‌లోని అల్మారాల్లోకి భారీ ఎత్తున నగదు, బంగారం ఎలా వచ్చింది అనే విషయమై సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయంలో బయటపడ్డ నోట్ల కట్టలు, బంగారం.. సీజ్ చేసిన పోలీసులు
X

అది రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ కార్యాలయం. ఆ కార్యాలయంలోని సెల్లార్‌లో కొన్ని అల్మరాలు ఉండగా.. వాటిని కొద్దిరోజులుగా వినియోగించడం లేదు. ఏదో అవసరమై అల్మారాలు ఓపెన్ చేయగా.. పెద్ద సూట్ కేస్‌లో నోట్ల కట్టలు, బంగారం బయటపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

యోజనా భవ‌న్‌లో రాష్ట్ర ఐటీ విభాగం, జన్ ఆధార్ తదితర ఆఫీసులు నిర్వహిస్తున్నారు. ఆ భవనంలోని బేస్మెంట్లో కొన్ని అల్మరాలు ఉండగా.. కొంతకాలంగా వాటిని ఎవరూ ఉపయోగించడం లేదు. శుక్రవారం అధికారులు ఏదో అవసరం పడి బేస్మెంట్‌లోని అల్మారాలను ఓపెన్ చేశారు.

వారికి ఓ అల్మారాలో ఒక పెద్ద ట్రాలీ సూట్ కేస్ కనిపించింది. దానిని తెరచి చూడగా భారీగా నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు కనిపించాయి. దీంతో అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి డబ్బు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూట్ కేస్‌లో మొత్తం రూ.2.31 కోట్ల విలువైన రూ.2 వేలు, రూ.500 నోట్ల కట్టలతో పాటు కిలో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు.

యోజనా భవన్‌లోని బేస్మెంట్ ప్రాంతాన్ని ఎక్కువగా ఆధార్ విభాగానికి చెందిన సిబ్బంది ఉపయోగిస్తుంటారు. దీంతో పోలీసులు ఆ విభాగానికి చెందిన ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బేస్మెంట్‌లోని అల్మారాల్లోకి భారీ ఎత్తున నగదు, బంగారం ఎలా వచ్చింది అనే విషయమై సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో అతి త్వరలో బయటపెడతామని పోలీసులు ప్రకటించారు.

కాగా, ప్రభుత్వ కార్యాలయంలో భారీ స్థాయిలో డబ్బు, బంగారం బయటపడటంతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అవినీతిపరులను ప్రభుత్వం రక్షిస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వారు మండిపడుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

First Published:  20 May 2023 12:24 PM GMT
Next Story