Telugu Global
National

పంజరంలో చిలక కాదు.. అంతకు మించి..

ఎన్డీఏ హయాంలో సీబీఐ దూకుడు పెంచిందని, మరింత సామర్థ్యంతో పనిచేసిందని అనుకుంటే పొరపాటే. 8 ఏళ్లలో సీబీఐ పెట్టిన 124 కేసుల్లో ప్రతిపక్ష నేతలపై పెట్టిన కేసుల సంఖ్య 118

పంజరంలో చిలక కాదు.. అంతకు మించి..
X

యూపీఏ హయాంలో పదేళ్ల కాలంలో రాజకీయ నాయకులపై సీబీఐ పెట్టిన కేసులు 72. ఇందులో ప్రతిపక్ష పార్టీల నేతలపై పెట్టిన కేసులు 43కాగా.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల పార్టీల నాయకులపై పెట్టిన కేసులు 29. ఇక ఎన్డీఏ హయాంలో గడచిన ఎనిమిదేళ్లలో సీబీఐ డీల్ చేసిన పొలిటికల్ నాయకుల కేసులు 124. ఎన్డీఏ హయాంలో సీబీఐ దూకుడు పెంచిందని, మరింత సామర్థ్యంతో పనిచేసిందని అనుకుంటే పొరపాటే. ఈ 124 కేసుల్లో తస్మదీయులపై పెట్టిన కేసుల సంఖ్య 118. బీజేపీ నేతలు కేవలం 8మంది మాత్రమే సీబీఐ ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి. సీబీఐ సమర్థంగా పనిచేసిందా, సమర్థంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసిందా..?

యూపీఏ హయాంలో సీబీఐ పంజరంలో చిలకలాగా యజమాని మాటల్ని వల్లె వేస్తోందంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 2013లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిపోయిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఇప్పటి పరిస్థితి చూస్తే సీబీఐని పంజరంలో చిలక అనడం కంటే.. మరింత ఘాటు పదం వాడేవారేమో. ఇటీవల కాలంలో సీబీఐ, ఈడీని కేవలం రాజకీయ ప్రతీకారాలకోసమే కేంద్రం వినియోగిస్తుందనే ఆరోపణలు పెరిగిపోయాయి. గతంలో కేవలం సీబీఐని వాడుకున్నారని అనుకుంటే.. ఇప్పుడు సీబీఐకి ఐటీ, ఈడీ కూడా జతకలిశాయి. వరుసగా జరుగుతున్న పరిణామాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. వైరి వర్గాలు తలెగరేస్తే అక్కడికి సీబీఐ వాలిపోతుంది, ఎవరైనా పోటీ వస్తున్నారనుకుంటే వెంటనే లిక్కర్ స్కామ్ లు పుట్టుకొచ్చేస్తాయి, సోదాలకు ఈడీ సిద్ధమవుతుంది. ఐటీ సోదాలంటూ హడలెత్తిస్తారు. కేవలం ప్రతిపక్ష నేతలే తప్పులు చేస్తున్నారా..? లేక వారినే కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయా..?

యూపీఏ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు 60శాతం మంది సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటే, ఎన్డీఏ హయాంలో అది 95శాతానికి పెరిగింది. అత్యథికంగా టీఎంసీ నేతలు 30మందిని సీబీఐ టార్గెట్ చేసింది. 26మంది కాంగ్రెస్ నేతలు, ఆర్జేడీకి చెందిన10మంది, బీజేడీకి చెందిన మరో 10మంది నేతలు ఈ లిస్ట్ లో ఉన్నారు. సీబీఐ డైరెక్టర్లు పదవీ విరమణ తర్వాత అప్పట్లో గవర్నర్లుగా వెళ్లిన ఉదాహరణలున్నాయి. ఆ తర్వాత ఈ ఆనవాయితీకి చెక్ పెట్టినా, సీబీఐ అధిపతులు మాత్రం అధికారంలో ఉన్న పార్టీలకు గులాములుగా మారిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్వతంత్ర ప్రతిపత్తి అనేది కేవలం పేపర్లకే పరిమితం అయింది. అధికారంలో ఎవరు ఉంటే వారు చెప్పినట్టల్లా వినడమే కేంద్ర దర్యాప్తు సంస్థల పనిగా మారింది. అందులోనూ ఎన్డీఏ హయాంలో అరాచకాలు మరీ పెరిగిపోయాయి. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశ పెడుతున్నారు. పోనీ దేశంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని అనుకుంటే.. బీజేపీ నేతలు మాత్రం వీరికి కంటికి కనిపించడంలేదు. పాతిక కోట్ల రూపాయలతో ఒక్కో ఎమ్మెల్యేని కొంటున్నా.. ఆ అవినీతి వీరిదాకా రాదు. కేవలం ప్రతిపక్ష నేతల అక్రమాలే సీబీఐ కంటికి కనిపిస్తున్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా.. ఈ రాజకీయ ప్రతీకార దాడులతో సీబీఐ ప్రతిష్ట దిగజారక మానదు.

First Published:  20 Sep 2022 4:32 AM GMT
Next Story