Telugu Global
National

బీజేపీని గద్దె దించడమే నా చివరి పోరు': టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ

బీజేపీని గద్దె దించడమే తన చివరి పోరాటమని టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళే ఓడిపోయారు. ఎవరైనా ఓటమిని చవిచూడాల్సిందే అని మమత అన్నారు.

బీజేపీని గద్దె దించడమే నా చివరి పోరు: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ
X

కేంద్రంలో అధికారం నుండి భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని 2024లో గద్దె దించడమే తన "చివరి పోరాటం" అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. అయితే చివరి పోరు అన్న వ్యాఖ్యలపై టిఎంసి అధినేత స్పష్టత ఇవ్వలేదు. వ‌చ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి. కేంద్రంలో అధికారం నుంచి కాషాయ పార్టీని గద్దె దింపేందుకు ఢిల్లీపై పోరాటం నాకు చివరిది. బీజేపీని అధికారం నుంచి గద్దె దింపేందుకు నేను హామీ ఇస్తున్నాను' అని మంగ‌ళ‌వారంనాడు కోల్ క‌త్తాలో జరిగిన ర్యాలీలో ఆమె అన్నారు.

"ఏదయినా స‌రే బీజేపీని ఓడించాలి" అని అన్నారు. "పశ్చిమ బెంగాల్‌ను రక్షించడం మా మొదటి పోరాటం. 2024లో కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి తొలగిస్తామని నేను హామీ ఇస్తున్నాను. మీరు మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తే, మేము గ‌ట్టిగా సమాధానం ఇస్తామని ఆమె అన్నారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1984లో 400 సీట్లకు పైగా గెలిచినప్పటికీ 1989 ఎన్నికల్లో ఓడిపోవడం గురించి మ‌మ‌తా బెనర్జీ ప్రస్తావిస్తూ, "అందరూ ఓటమిని రుచి చూడాల్సిందే" అని అన్నారు.

"ఇందిరా గాంధీ బలమైన రాజకీయ నాయకురాలు, కానీ ఆమె కూడా ఓటమిని రుచి చూసింది. బీజేపీకి దాదాపు 300 మంది ఎంపీలు ఉన్నారు, కానీ బిహార్ పోయింది, ఇంకా మరికొందరు అదే బాట అనుసరించనున్నారు. ఎన్నికల ముందు ఎంతో మంది నాయ‌కులు కాషాయ‌పార్టీని వీడిపోతారు అప్పుడు ఆ పార్టీ ఒంట‌ర‌వుతుంద‌ని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా, మ‌మ‌త‌ వ్యాఖ్య‌ల‌పై బిజెపి స్పందిస్తూ..లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ఆమె త‌ల‌కిందుల‌వుతారేమో అంటూ వ్యాఖ్యానించింది.2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆమె విశ్రాంతి తీసుకుంటారో లేదో స్పష్టంగా చెప్పాలి. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య అన్నారు.

First Published:  30 Aug 2022 1:43 PM GMT
Next Story