Telugu Global
National

ఏమిటీ దౌర్భాగ్యం..? రైలు ప్రమాదాలపై ప్రతిపక్షాల ధ్వజం

వరుస ప్రమాదాలు జరుగుతుంటే రైల్వే శాఖ నిద్రపోతోందా అని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తక్షణ దర్యాప్తు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

ఏమిటీ దౌర్భాగ్యం..? రైలు ప్రమాదాలపై ప్రతిపక్షాల ధ్వజం
X

ఓవైపు వందే భారత్, నమో భారత్ అంటూ.. కేంద్రం గొప్పలు చెప్పుకుంటోంది. మరోవైపు రాంగ్ సిగ్నల్స్ తో రైళ్లు ఒకదానిమీదకు ఒకటి ఎక్కేస్తున్నాయి. తాజాగా ఏపీలో జరిగిన ప్రమాదంలో ప్యాసింజర్ రైళ్లు కాబట్టి ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది. అదే స్థానంలో వందే భారత్ లను ఊహించుకుంటే.. గొప్పలు చెప్పుకునే కేంద్ర పెద్దలు ఓసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ప్రమాదం మరచిపోకముందే ఇప్పుడు అదే కోస్తా ప్రాంతం ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ప్రమాదం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ కూడా సిగ్నలింగ్ వ్యవస్థలోని లోపాలే రైలు ప్రమాదానికి కారణం. దీంతో అసలు భారత రైల్వేలోని సిగ్నలింగ్ వ్యవస్థ సమర్థతపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

ఎందుకీ అవస్థ..?

ఓవైపు వందే భారత్ వంటి అధునాతన రైళ్లను తీసుకొస్తున్నాం, ఆశ్చర్యపోయే సౌకర్యాలు తెస్తున్నామంటూ కేంద్రం డబ్బాకొట్టుకుంటోంది. ఆ సౌకర్యాలన్నీ అనుభవించాలంటే కనీసం ప్రయాణికుల ప్రాణాలు ఉండాలి కదా అనేది ప్రతిపక్షాల సూటి ప్రశ్న. ఇక్కడ వందలమంది ప్రాణాలు హరీ అంటుంటే.. అక్కడ వందల మైళ్ల వేగం అందుకుంటున్నామని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు నేతలు. తాజా ప్రమాదంతో బీజేపీని మరింతగా టార్గెట్ చేశారు.

వరుస ప్రమాదాలు జరుగుతుంటే రైల్వే శాఖ నిద్రపోతోందా అని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తక్షణ దర్యాప్తు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు అందరూ సంఘీభావం తెలపాలన్నారు. కేంద్రం, రైల్వే శాఖ నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని, ఇలాంటి ప్రమాదాలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


ఏపీలో రైలు ప్రమాదం బాధాకరం అని అన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పదే పదే ప్రమాదాలు జరగడం ఆందోళనకరం అని చెప్పారు. వెంటనే ఎంక్వయిరీ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. మానవ తప్పిదం లేదని తెలిస్తే సిగ్నలింగ్ వ్యవస్థను ప్రక్షాళణ చేయాలని కోరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. వరుస ప్రమాదాలు బాధాకరం అని చెప్పారు స్టాలిన్.



First Published:  30 Oct 2023 6:45 AM GMT
Next Story