Telugu Global
National

స్పీడ్ పెంచిన విపక్షాలు.. జులైలో రెండో మీటింగ్

పాట్నాలో విపక్షాల తొలి మీటింగ్ తర్వాత బీజేపీలో వణుకు మొదలైందని, మోదీ చాలా ఆందోళనగా కనపడుతున్నారని శరద్ పవార్ చెబుతున్నారు.

స్పీడ్ పెంచిన విపక్షాలు.. జులైలో రెండో మీటింగ్
X

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు స్పీడ్ పెంచాయి. ఈనెల 23న పాట్నాలో సమావేశం తర్వాత రెండో మీటింగ్ కి ప్లేస్, డేట్ ఖరారు చేశాయి. జులై 13, 14 తేదీల్లో బెంగళూరులో రెండో మీటింగ్ జరుగుతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. వేదిక సిమ్లా నుంచి బెంగళూరుకి మారిందని చెప్పారు. విపక్షాల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కలసి కట్టుగా ముందుకు సాగేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడుతున్నాయని అన్నారాయన.

ఏకతాటిపైకి 18 పార్టీలు..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కసి అన్ని పార్టీల్లో ఉంది కానీ వారిమధ్య ఆధిపత్య పోరు కూడా ఉంది. విభేదాలతో ఒకరితో ఒకరు పోటీపడి చివరకు 2019లో అధికారాన్ని మరోసారి బీజేపీకి అప్పగించారు. 2024లో కూడా అదే జరిగితే విపక్షాల ఉనికి ప్రమాదంలో పడే అవకాశముంది. అందుకే ఈసారి కలసికట్టుగా బీజేపీని ఎదుర్కోడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ని హైలెట్ చేయడం కొంతమందికి ఇష్టం లేకపోయినా, బీజేపీపై ద్వేషం అందర్నీ ఒకే చోటకు చేర్చింది. ఈనెల 23న పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ తో కలిపి మొత్తం 18 రాజకీయ పక్షాలు ఆ మీటింగ్ కి హాజరయ్యాయి. బీజేపీని గద్దె దించడమే ఉమ్మడి అజెండాగా ప్రకటించాయి.

బీజేపీలో వణుకు..

నెలరోజుల్లోపు విపక్షాలన్నీ రెండో మీటింగ్ కి సిద్ధపడటం విశేషం. ఈసారి కాంగ్రెస్ పాలిత కర్నాటకలో సమావేశానికి అందరూ సిద్ధమయ్యారు. బెంగళూరులో జులై 13, 14 తేదీల్లో రెండురోజులపాటు మీటింగ్ జరుగుతుంది. పాట్నాలో విపక్షాల తొలి మీటింగ్ తర్వాత బీజేపీలో వణుకు మొదలైందని, మోదీ చాలా ఆందోళనగా కనపడుతున్నారని శరద్ పవార్ చెబుతున్నారు. ఈసారి కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలో బీజేపీని గద్దె దించాలనే కసితో ఉన్నాయని, 2024 ఎన్నికలు కాషాయదళానికి అంత ఈజీ కాదని తేల్చి చెప్పరాయన. బెంగళూరు మీటింగ్ తర్వాత తమ కార్యాచరణ మరింత వేగవంతమవుతుందని స్పష్టం చేశారు.

First Published:  29 Jun 2023 1:38 PM GMT
Next Story