Telugu Global
National

దర్యాప్తు సంస్థల దుర్వినియోగం.. సుప్రీం మెట్లెక్కిన విపక్షాలు..

మొత్తం 14 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ స్వీకరించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఏప్రిల్ 5న దీనిపై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.

దర్యాప్తు సంస్థల దుర్వినియోగం.. సుప్రీం మెట్లెక్కిన విపక్షాలు..
X

సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు విపక్ష నేతలు. రాజకీయ కుట్రలో భాగంగా.. వైరి వర్గాలపైకి సీబీఐ, ఈడీని ఉసిగొల్పుతున్నారని అన్నారు. గతంలో కూడా ఇదే విషయంపై పలుమార్లు ఆరోపణలు చేసినా కేంద్రానికి చీమకుట్టినట్టయినా లేదని, న్యాయస్థానాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీం మెట్లెక్కారు విపక్ష నేతలు. మొత్తం 14 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ ను స్వీకరించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఏప్రిల్ 5న దీనిపై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.

ఏకమైన విపక్షాలు..

ఇటీవల ప్రధాని నరేంద్రమోదీకి కూడా కూడా విపక్ష నేతలు దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై లేఖ రాశారు. 8 పార్టీల నేతలు ప్రధానికి లేఖ రాసినా స్పందన లేదు. అయితే ఇప్పుడు మరింత మంది జతకలిశారు, కేంద్ర దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేశారు. ప్రధానికి లేఖ రాసిన సమయంలో కాంగ్రెస్ విపక్షాలతో కలవలేదు, ఇప్పుడు సుప్రీంలో వేసిన పిటిషన్లో కాంగ్రెస్ కూడా భాగస్వామి కావడం విపక్షాల ఐక్యతకు నిదర్శనం అంటున్నారు.

పిటిషన్లో ఏముందంటే..?

కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ కేవలం బీజేపీ ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఈ పిటిషన్‌ లో విపక్షాలు ఆరోపించాయి. ఒకవేళ సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరితే.. ఆ తర్వాత వారిపై ఉన్న కేసులు ఎక్కడివక్కడే ఆగిపోతున్నాయని చెప్పారు విపక్ష నేతలు. 95శాతం కేసులు ప్రతిపక్షాలపైనే నమోదవుతున్నాయని అన్నారు. అరెస్టుకు ముందు, తర్వాత దర్యాప్తు సంస్థలు పాటిస్తున్న మార్గదర్శకాలేమిటో తెలియజేయాలని కోరారు.

ఎవరెవరు..?

కాంగ్రెస్‌ తోపాటు, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, జనతా దళ్‌ యునైటెడ్‌, భారత్‌ రాష్ట్ర సమితి, రాష్ట్రీయ జనతా దళ్‌, సమాజ్‌ వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం), నేషనల్‌ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు, డీఎంకే పార్టీలు సంయుక్తంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. విపక్షాల ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. దర్యాప్తు ఏజెన్సీలు స్వతంత్రంగానే పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.

First Published:  24 March 2023 9:06 AM GMT
Next Story