Telugu Global
National

రాహుల్ కి మమత సపోర్ట్.. భవిష్యత్ కార్యాచరణపై సోనియా చర్చలు

ప్రతిపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేసిందని తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ప్రసంగాలను బట్టి అనర్హత వేటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దిగజార్చారని మండిపడ్డారామె.

రాహుల్ కి మమత సపోర్ట్.. భవిష్యత్ కార్యాచరణపై సోనియా చర్చలు
X

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపింది. ఇప్పటి వరకూ దర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకుని కేంద్రం ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతుందో చూశాం. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ సభ్యుల గొంతు నొక్కాలని చేసిన ప్రయత్నం తీవ్ర విమర్శలపాలవుతోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్టు లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటించిన అనంతరం దేశ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు ఘాటుగా స్పందించారు.

సత్యం మాట్లాడేవారి గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. అయినా తాము సత్యమే మాట్లాడతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అవసరమైతే జైలుకు వెళ్తామని ఖర్గే చెప్పారు. అదానీ వ్యవహారంపై లోక్ సభలో ప్రశ్నించినందుకే రాహుల్‌ పై వేటు వేశారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని, భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ పాపులారిటీ పెరగడం వల్లే ఆయనపై వేటు వేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి. పార్లమెంట్ నుంచి తొలగించగలరేమో కానీ, కోట్లాది మంది ప్రజల హృదయాల నుంచి రాహుల్‌ ను తొలగించలేరని అన్నారు కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్.

ప్రతిపక్ష నేతల సపోర్ట్..

ప్రతిపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేసిందని తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ప్రసంగాలను బట్టి అనర్హత వేటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దిగజార్చారని మండిపడ్డారామె. దొంగ అన్నందుకు రాహుల్ సభ్యత్వం తొలగిస్తారా అని ప్రశ్నించారు ఉద్ధవ్ థాక్రే. దేశంలో దొంగలు, దోపిడిదారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారిని శిక్షించకుండా రాహుల్‌‌ ను శిక్షిస్తారా అని ప్రశ్నించారు.

రాహుల్ నివాసానికి సోనియా..

రాహుల్ గాంధీపై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేసిన తర్వాత సోనియా గాంధీ.. హుటా హుటిన రాహుల్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ సీనియర్ నేతలతో ఆమె భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. మొత్తమ్మీద రాహుల్ గాంధీ కోర్టు శిక్ష, అనంతరం లోక్ సభ సభ్యత్వంపై పడిన వేటు.. తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కక్షసాధింపు ద్వారా బీజేపీ ఏమేరకు లాభపడుతుందో ముందు ముందు తేలిపోతుంది.

First Published:  24 March 2023 10:57 AM GMT
Next Story