Telugu Global
National

తప్పతాగి ఫ్లైటెక్కాడు.. పంజాబ్ సీఎంపై ప్రతిపక్షాల ఆరోపణలు

భగవంత్ మాన్‌ మద్యం మత్తులో ఉన్నందువల్లే కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని, మద్యం మత్తులో ఫ్లైట్ ఎక్కిన ఆయన్ను విమానం నుంచి కిందకు దించేశారని వార్తలు వచ్చాయి.

తప్పతాగి ఫ్లైటెక్కాడు.. పంజాబ్ సీఎంపై ప్రతిపక్షాల ఆరోపణలు
X

ఇవాళ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ తొలి జాతీయ సమావేశం `రాష్ట్రీయ జన ప్రతినిధి సమ్మేళన్` జరిగింది. ఈ కార్యక్రమానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హాజరు కావాల్సి ఉంది. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన సమయానికి తన పర్యటనను ముగించుకొని రాలేకపోయారు. అయితే ఆయన తప్ప తాగడం వల్లే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఆప్ జాతీయ సమావేశంలో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొనాల్సి ఉంది.

జర్మనీ పర్యటనలో ఉన్న మాన్ త‌న‌ షెడ్యూల్ ప్రకారం పర్యటన ముగించుకొని ఢిల్లీలో జరిగే పార్టీ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన చివరి నిమిషంలో సమావేశానికి హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా భగవంత్ మాన్ ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం అయిందని సీఎం కార్యాలయం వెల్లడించింది. అయితే ఇది అసలు కారణం కాదని.. భగవంత్ మాన్‌ మద్యం మత్తులో ఉన్నందువల్లే కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని, మద్యం మత్తులో ఫ్లైట్ ఎక్కిన ఆయన్ను విమానం నుంచి కిందకు దించేశారని వార్తలు వచ్చాయి.

దీంతో ప్రతిపక్షాలు భగవంత్ మాన్ పై విమర్శల దాడికి దిగాయి. అసలు జరిగిందేంటో చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీని డిమాండ్ చేశాయి. భగవంత్ మాన్ తో కలిసి ప్రయాణించిన ఒక వ్యక్తి.. భగవంత్ తప్పతాగి ఉండడం వల్ల ఎయిర్ పోర్ట్ లో ఆయన్ను విమానం నుంచి దింపేశారని.. ఆయన నడవలేని స్థితిలో ఉండటంతో భార్య, భద్రతా సిబ్బంది సాయం చేశారని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టును షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ఇక అకాలీ దళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ భగవంత్ మాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అతడి ప్రవర్తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలు సిగ్గు పడేలా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి మాన్ ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. జర్మనీ దేశాన్ని ఈ విషయమై విచారించాలని ఆయన కోరారు. కాగా మాన్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి మల్విన్ దర్ సింగ్ మాట్లాడుతూ భగవంత్ మాన్ షెడ్యూల్ ప్రకారమే ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారన్నారు. అనారోగ్యం కారణం వల్ల కొంత ఆలస్యం అయిందన్నారు.

భగవంత్ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువస్తున్నారన్న అక్కసుతోనే ప్రతిపక్షాలు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. తాము చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ లో విచారించుకుని నిజాలు తెలుసుకోవాలని సూచించారు. కాగా పంజాబ్ లో భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని.. అవినీతికి పాల్పడ్డ మంత్రిని సైతం క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారన్న పేరు తెచ్చుకున్నారు. అలాంటి భగవంత్ తప్ప తాగి విమానం ఎక్కినట్లు ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

First Published:  19 Sep 2022 1:32 PM GMT
Next Story