Telugu Global
National

అన్ని ఉత్తుత్తి మాటలేనా.. భగవంత్ మాన్ పాలనపై ప్రతిపక్షాల విమర్శలు

తాజాగా మాన్ కాన్వాయ్‌లో 42 వాహనాలు ఉన్నట్లు తెలియడంతో ఆయనపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పాలన అంటే ఇదేనా అని.. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

అన్ని ఉత్తుత్తి మాటలేనా.. భగవంత్ మాన్ పాలనపై ప్రతిపక్షాల విమర్శలు
X

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చి భగవంత్ సింగ్ మాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా సంచల నిర్ణయాలు తీసుకుంటూ అందరి మెప్పు పొందారు. ఒక్క శాతం అవినీతిని కూడా ఉపేక్షించనని ప్రకటించిన మాన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రి విజయ్‌ని క్యాబినెట్ నుంచి డిస్మిస్ చేశారు. అలాగే వీఐపీ సంస్కృతికి స్వస్తి పలకడానికి మాన్ గట్టి చర్యలు చేపట్టారు. పంజాబ్ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో వీఐపీ గదులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

వీఐపీలకు, ప్రజాప్రతినిధులకు ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీని తొలగించారు. ఇలా సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో సంచలన నిర్ణయాలు తీసుకున్న మాన్.. పగ్గాలు చేపట్టిన కొత్తలో అందరు చేసినట్లే తాను కూడా హడావుడి చేశానని నిరూపించుకుంటున్నారు. ఇటీవల జర్మనీ పర్యటనకు వెళ్లిన భగవంత్ మాన్ అక్కడ పీకలదాగా తాగి విమానం ఎక్కగా సిబ్బంది ఆయనను కిందకు దింపేసినట్లు వార్తలు వచ్చాయి. వీఐపీ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నట్లు తరచూ చెప్పే మాన్‌వి ఉత్తుత్తి మాటలేనని ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చెబుతున్నాయి.

తాజాగా మాన్ కాన్వాయ్‌లో 42 వాహనాలు ఉన్నట్లు తెలియడంతో ఆయనపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పాలన అంటే ఇదేనా అని.. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మాన్ కాన్వాయ్‌లో ఎన్ని వాహనాలు ఉన్నాయని అని ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించగా 42 ఉన్నట్లు తెలిసింది.

పంజాబ్‌లో అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఎవరూ ఇన్ని వాహనాలు వాడకపోవడంతో మాన్‌పై విమర్శలు వస్తున్నాయి. ప్రకాశ్ సింగ్ బాదల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కాన్వాయ్‌లో 33 వాహనాలు ఉండేవి. అమరీందర్ సింగ్ కాన్వాయ్‌లో కూడా అన్నే వాహనాలు ఉండేవి. చరణ్ జీత్ సింగ్ కాన్వాయ్‌లో 39 వాహనాలు ఉండేవి. ఇప్పుడు మాన్ కాన్వాయ్‌లో 42 వాహనాలు ఉన్నట్లు తెలియడంతో ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీలకు, ఇప్పుడు చేస్తున్న పాలనకు అసలు పోలికే లేదని విమర్శలు చేస్తున్నాయి. కాన్వాయ్‌లో ఇన్ని వాహనాలు వాడటం వల్ల ఏం ఉపయోగం ఉందని, ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు.

Next Story