Telugu Global
National

ఐక్యతకన్నా అంద‌రి దృష్టీ నాయకత్వం మీదే

బీజేపీని కచ్చితంగా వ్యతిరేకిస్తున్న పార్టీలలో మోదీ వ్యతిరేకతకు ఏం మాత్రం కొదవలేదు. కానీ ప్రతిపక్షాల ఐక్యతకు కృషిచేస్తున్న నాయకులలోనే నాయకత్వం తమ చేతిలోనే ఉండాలన్న ఆకాంక్ష బలంగా కనిపిస్తోంది.

ఐక్యతకన్నా అంద‌రి దృష్టీ నాయకత్వం మీదే
X

ప్రతిపక్షాల ఐక్యతకు జరుగుతున్న ప్రయత్నాలకన్నా ఆ ఐక్యతా కూటమికి నాయకులు ఎవరు అన్న విషయం మీదే మల్లగుల్లాలు పడట‌మే అధికంగా కనిపిస్తోంది. ముందు ఐక్యత తరవాత నాయకత్వం మీద చర్చ అన్న భావన ప్రతిపక్ష నేతలలో కనిపించడం లేదు. ఈ వైఖరి అంతిమంగా మోదీకే మేలు చేసినా ఆశ్చర్య పడక్కర్లేదు.

బీజేపీని కచ్చితంగా వ్యతిరేకిస్తున్న పార్టీలలో మోదీ వ్యతిరేకతకు ఏం మాత్రం కొదవలేదు. కానీ ప్రతిపక్షాల ఐక్యతకు కృషిచేస్తున్న నాయకులలోనే నాయకత్వం తమ చేతిలోనే ఉండాలన్న ఆకాంక్ష బలంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాల ఐక్యతకు నడుం కట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు (కె.సి.ఆర్.) కేవలం ప్రతిపక్షాల ఐక్యత గురించే మాట్లాడకుండా ఇక మీదట తాను జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసే ఆయన ఉద్దేశాన్ని తప్పుపట్టలేం. ఎందుకంటే మోదీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వారిలో అరవింద్ కేజ్రీవాల్, కె.చంద్ర శేఖర్ రావు ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్నారు. ఇద్దరూ మాటకారులే. బీజేపీకి మాటకు మాట జవాబివ్వగల సమర్థులే. ఈ మధ్యకాలంలో కె.సి.ఆర్. బీజేపీ మీద ఒంటి కాలి మీద లేస్తున్నారు. దానికి బలమైన కారణం ఉంది. తెలంగాణాలో పాగా వేయడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీని నిలవరించడమే తక్షణ కర్తవ్యం అని కె.సి.ఆర్. భావిస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోదీ, అమిత్ షా ద్వయం నాయకత్వంలో పదిలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా బీటలూ స్పష్టంగానే ఉన్నాయి. అందువల్ల జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకోసం ప్రయత్నించడం మేలు కదా అన్నది కె.సి.ఆర్. వ్యూహంలా ఉంది. మరో వేపు కేజ్రీవాల్ మోదీని ఎదుర్కోగలిగిన ధీరుడినని అనుక్షణం నిరూపించుకుంటున్నారు. ఆయన ఢిల్లీకి పరిమితం కాకుండా పంజాబ్ కు విస్తరించినట్టుగానే రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కూడా తన బలం ప్రదర్శించాలని భావిస్తున్నారు.

ప్రతిపక్షాల ఐక్యత గురించి మొట్టమొదట మాట్లాడిన వారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇటీవలి కాలంలోనే కాకుండా అంతకు ముందూ ఆమె ప్రతిపక్ష నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి కావాలన్న కోరిక ఆమెకూ లేకపోలేదు. కానీ ఆమె సన్నిహితుడు పార్థా చటర్జీని ఇటీవల అరెస్టు చేయడంవల్ల ఆమె పాలనకూ అవినీతి కళంకం అంటింది. అందుకని ఆమె కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నారు. వీలు కుదిరితో ప్రధానమంత్రి అభ్యర్థిగా దిగడానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వెనుకాడబోరు. మోదీ ప్రభుత్వ నిర్వహణతోనే గాక ఆ ప్రభుత్వం అనుసరించే విధానాలతో కూడా జనం రోసి పోయి ఉన్న మాట వాస్తవం. సమాజాన్ని మతాలవారీగా విభజించి హిందువుల ఓట్లు దండుకోవడానికి, వీలున్న చోట్ల కుల సమీకరణలనూ తమకు అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ పాట్లు పడ్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా కనిపించలేదు. అయితే 2014లో కన్నా ఎక్కువ సీట్లు సంపాదించి ఆశ్చర్య పరిచింది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ నిర్వీర్యమై పోవడమే. 2014 నుంచి కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగదుడుపుగా మారుతోంది. 2014లో 44 సీట్లు సంపాదించిన కాంగ్రెస్ 2019లో మరో ఎనిమిది సీట్లు పెంచుకోగలిగింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని చూస్తే కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ దయనీయమైన స్థితికి చేరి కేవలం రెండు రాష్ట్రాలలోనే అధికారంలో ఉంది. మరికొన్ని చోట్ల ఇతర పార్టీలతో కలిసి అధికార పక్షంగా ఉంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా అస్తిత్వం ఉన్న పార్టీ కాంగ్రెసే అయినా సంస్థాగతంగా ఉన్న గందరగోళం, అంతర్గత వైరుధ్యాలు, సీనియర్ నాయకుల రాజీనామాల వెల్లువ ఆ పార్టీని కుంచింప చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాలు తనకు సంబంధం లేని వ్యవహారంగా కాంగ్రెస్ పరిగణిస్తోంది.

ఈ లోగా మోదీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటున్నట్టు స్పష్టంగా గోచరిస్తోంది. కాంగ్రెస్ ఎంత బలహీన పడిపోయినప్పటికీ 170 నుంచి 180 సీట్లలో బీజేపీకి ప్రత్యక్ష ప్రత్యర్థి కాంగ్రెసే. బీజేపీ మీద పెరుగుతున్న వ్యతిరేకతను వినియోగించుకోగలిగితే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా మరో 50 సీట్లలో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలిగిన అవకాశం ఉంది. కాంగ్రెస్ లో ఆ కళే కనిపించకపోవడం పెద్ద విషాదం.

ఈ నేపథ్యంలోనే కె.సి.ఆర్. ప్రతిపక్షాలను కూడగట్టే లక్ష్యంతో బుధవారం బిహార్ వెళ్లి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో సంప్రదింపులు జరిపారు. ఆ తరవాత వారిద్దరూ కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాత్రం ఇబ్బందిక‌ర‌మైన‌ దృశ్యాలే కనిపించాయి. ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమైతే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరూ అనే విషయంలో కె.సి.ఆర్. వైఖరి స్ప‌ష్టంగా కనిపించింది. పరిపాలనానుభవం, రాజకీయ చతురత ఉన్న బిహార్ ముఖ్యమంత్రి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాట వేయాలని ప్రయత్నిస్తుంటే కె.సి.ఆర్. ఆయన చేయిపట్టి లాగి కూర్చోవాలని అడుగుతున్న వీడియోలు గురువారం విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. నితీశ్ కుమార్ బీజేపీని వదిలించుకుని తేజస్వీ యాదవ్ నాయకత్వం వహిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయిన ఆర్.జె.డి.తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరవాత ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమైతే నితీశ్ కుమారే ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. నితీశ్ కుమార్ మాత్రం ఈ పరిణామాన్ని పట్టించుకోనట్టు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయంలో విలేకరుల సమావేశంలో చర్చకు తావివ్వకూడదని అనుకున్నారు. ఇది ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం.

కానీ కె.సి.ఆర్. తన మనసులోని మాట నోటితో చెప్పకుండానే చెప్పారు. ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాదిన్నరకు పైగా గడవాల్సి ఉంది. ఈ లోగా ప్రతిపక్షాల ఐక్యత సాధించడం ఎలాగో ఆలోచించకుండా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్న విషయాన్ని చ‌ర్చ‌ చేయడం అసలుకే మోసం తెచ్చే వ్యవహారం. 1989లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ముందు ఐ.కె.గుజ్రాల్, ఆ తరవాత దేవెగౌడ ప్రధాని అయ్యారు. కానీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్న చర్చ రాలేదు. అధికారంలో ఉన్న పక్షాన్ని గద్దె దించడం ఎలాగన్నదే ప్రతిపక్షాల ఏకైక లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్న విషయంపై ఇద్దరు ముఖ్యమంత్రుల సంప్రదింపులు తరవాత కేసీఆర్ ప్రధానమంత్రి అభ్యర్థిని తానే అని చెప్పకపోవచ్చు. కానీ, సంకేతం అందించారు.

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, బీజేపీని సమర్థంగా ఎండగట్టడం మాత్రమే ప్రధానమంత్రి స్థానానికి సోపానం అనుకుంటే ప్రతిపక్ష ఐక్యతకు ఆదిలోనే గండి పడ్తుంది. దీన్ని కె.సి.ఆర్. నివారించలేకపోయారు. ఆదిలోనే హంసపాదు అంటే ఇదే. ఇప్పుడు జరగవలసింది మత త‌త్వాన్ని వ్యతిరేకించే శక్తులను కూడగట్టి మోదీని నిలవరించడానికి అనుసరించవలసిన వ్యూహాన్ని ఖరారు చేయడమే ముఖ్యం. ఆ అంశాన్ని వ్యక్తిగత లక్ష్యాలు దెబ్బతీయకూడదు. కేవలం మాటకారితనం అన్ని వేళలా నప్పదు.

First Published:  4 Sep 2022 5:17 AM GMT
Next Story