Telugu Global
National

ఒక్క ఛాన్స్ ప్లీజ్!

శుక్రవారం నగరంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో అధికారం తమదైనా.. కార్పొరేషన్ మాత్రం బీజేపీ చేతిలో ఉందని, దీంతో నగరంలో వాయు, నీటి కాలుష్య నివారణకు ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వాపోయారు.

ఒక్క ఛాన్స్ ప్లీజ్!
X

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అంటూ బడా బడా నాయకులు జనం చుట్టూ తిరగడం మామూలే. అయితే ప్రస్తుతం ప్రతి నాయకుడు ఎన్నికలతో సంబంధం లేకుండా జనం కనిపిస్తే చాలు ఈసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి..అంటూ వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ వ్యవహారం ఎక్కువగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఒక్క ఛాన్స్ ప్లీజ్ .. అనే నినాదంతో జనంలోకి వెళ్ళింది. ప్రజలు కూడా జగన్ కు అవకాశం ఇచ్చి సీఎంని చేశారు.

ఇప్పుడు అదే జగన్ ప్రజల్లోకి వెళ్లిన ప్రతిసారి ఒక్క ఛాన్స్ అడిగినందుకు అధికారమిచ్చారు. అందుకుగాను ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాను.. నాకు మరొక ఛాన్స్ ఇవ్వండి.. అంటూ జనాన్ని వేడుకుంటున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుది వేరే కథ. 80 లలోకి దగ్గర పడ్డ ఆయన రాష్ట్రానికి సుదీర్ఘ కాలం సీఎంగా పని చేశాను.. చివరిగా మరొకసారి నాకు ఛాన్స్ ఇవ్వండి.. అంటూ జనాన్ని వేడుకుంటున్నారు.

వీళ్ళిద్దరి పరిస్థితి ఈ విధంగా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాక్కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ ..అంటూ ప్రజలను వేడుకున్నాడు.

ఈనెల 4వ తేదీన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపు సాధించడానికి అధికార ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే శుక్రవారం నగరంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో అధికారం తమదైనా.. కార్పొరేషన్ మాత్రం బీజేపీ చేతిలో ఉందని, దీంతో నగరంలో వాయు, నీటి కాలుష్య నివారణకు ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వాపోయారు. గతంలో కూడా ఎప్పుడూ ఢిల్లీ పీఠం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఒకే పార్టీ చేతిలో లేవని ఈసారి మాత్రం ఆ సాంప్రదాయాన్ని తిరగరాయాలన్నారు. అందుకోసం తమకు ఒక ఛాన్స్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కేజ్రీవాల్ వ్యాపారులను కోరారు.

First Published:  2 Dec 2022 2:42 PM GMT
Next Story