Telugu Global
National

తప్పుడు సోషల్ మీడియా పోస్టుపై క్షమాపణలు చెప్పినా.. క్రిమినల్ ప్రొసీడింగ్స్ తప్పవు : సుప్రీంకోర్టు

సోషల్ మీడియా అనేది మనకు తప్పనిసరి ఏమీ కాదు. కానీ, ఎవరైనా దాన్ని ఉపయోగిస్తుంటే మాత్రం.. దాని తర్వాత కలిగే పరిణామాలకు కూడా సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

తప్పుడు సోషల్ మీడియా పోస్టుపై క్షమాపణలు చెప్పినా.. క్రిమినల్ ప్రొసీడింగ్స్ తప్పవు : సుప్రీంకోర్టు
X

సోషల్ మీడియాలో అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టి.. ఆ తర్వాత క్షమాపణలు కోరితే సరిపోదని. వారిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ (నేర విచారణ) ఎత్తివేయడానికి ఆ క్షమాపణలు ఎంత మాత్రం పనికి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ఎమ్మెల్యే, సినీ నటుడు ఎస్ వీ శేఖర్ మహిళా జర్నలిస్టులను కించపరిచేలా ఉన్న పోస్టును షేర్ చేశారు. దీనికి సంబంధించిన కేసు విచారణ నుంచి తప్పించాలని ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.

మహిళా జర్నలిస్టులను కించ పరిచేలా ఉన్న పోస్టును ఎస్ వీ శేఖర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడులో ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా శేఖర్ లాయర్ వాదిస్తూ.. తన క్లయింట్ తన తప్పును తెలుసుకొని పోస్టును డిలీట్ చేశారని.. అంతే కాకుండా భేషరతుగా క్షమాపణలు కూడా తెలియజేసినట్లు ధర్మాసనానికి తెలిపారు. 72 ఏళ్ల శేఖర్‌కు చూపు సరిగా లేదని.. సదరు పోస్టును పూర్తిగా చదవకుండానే.. అనుకోకుండా షేర్ చేశారని లాయర్ పేర్కొన్నారు.

నటుడు, ఎమ్మెల్యే శేఖర్ ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చారని.. ఆయనకు మహిళా జర్నలిస్టుల పట్ల గౌరవం ఉందని తెలిపారు. ఆ పోస్టు చదివే సమయంలో తన కళ్లకు మందు వేసుకున్నారని.. దాంతో ఆ పోస్టును చదవకుండానే అసంకల్పితంగా షేర్ చేసినట్లు శేఖర్ లాయర్ తెలిపారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక పోస్టులోని విషయాన్ని చదవకుండా.. అంత నిర్లక్ష్యంగా ఎలా షేర్ చేస్తారని మండిపడింది. శేఖర్‌పై జరుగుతున్న నేర విచారణను తాము నిలిపివేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియా అనేది మనకు తప్పనిసరి ఏమీ కాదు. కానీ, ఎవరైనా దాన్ని ఉపయోగిస్తుంటే మాత్రం.. తర్వాత కలిగే పరిణామాలకు కూడా సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. శేఖర్ ఈ విషయంలో నేర విచారణను ఎదుర్కోవలసిందే అని స్పష్టం చేసింది.

శేఖర్ షేర్ చేసిన పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడులోని చెన్నై, కరూర్, తిరునల్వేలి జిల్లా కోర్టుల్లో జర్నలిస్టుల అసోసియేషన్లు 2018లో కేసులు పెట్టాయి. ఈ నేపథ్యంలో తనపై వేసిన పిటిషన్లు కొట్టేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

గత నెలలో మద్రాస్ హైకోర్టులో జరిగిన ఈ విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఆసక్తికరమైన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పంపించే, షేర్ చేసే సందేశాలు వదిలిన బాణం లాంటివని పేర్కొన్నది. సదరు మెసేజ్ పంపకుండా, ఒక వ్యక్తి కంట్రోల్‌లో ఉన్నంత కాలం ఏమీ కాదు. కానీ ఒక సారి దాన్ని పంపిస్తే మాత్రం ఆ తర్వాత జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాల్సిందే అని పేర్కొన్నది. తమ నుంచి పంపబడిన, షేర్ చేయబడిన పోస్టుకు పూర్తి బాధ్యత వారిదే అని స్పష్టం చేసింది. ఒక సారి బాణాన్ని వదిలిన తర్వాత తప్పకుండా డ్యామేజ్ జరుగుతుంది. అలాంటి సమయంలో క్షమాపణలు చెప్పి ఆ నష్టాన్ని పూడ్చలేరని తెలిపింది.

ఎస్ వీ శేఖర్‌ను ఈ కేసు విచారణలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా అనుమతి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టును కోరగా.. ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ విషయంలో ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని శేఖర్ తరపు లాయర్‌ను ఆదేశించింది.

First Published:  19 Aug 2023 3:19 AM GMT
Next Story