Telugu Global
National

మిస్టర్ థరూర్.. ఏంటీ డబుల్ యాక్షన్.. రిగ్గింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్

మిస్టర్ థరూర్.. ఏంటీ డబుల్ యాక్షన్.. రిగ్గింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్

మిస్టర్ థరూర్.. ఏంటీ డబుల్ యాక్షన్.. రిగ్గింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
X

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక సమయంలో రిగ్గింగ్ జరిగిందని, ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నట్లు పోటీ చేసిన సీనియర్ నేత శశిథరూర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కాంగ్రెస్ చీఫ్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రి ఘాటుగా స్పందించారు. శశిథరూర్ డబుల్ యాక్షన్ చేస్తున్నారంటూ మండి పడ్డారు. తమ వద్ద ఒక మాట.. మీడియా ముందు మరో మాట ఎందుకు మాట్లాడుతున్నారో థరూర్‌కే తెలియాలంటూ ఫైర్ అయ్యారు.

అధ్యక్ష ఓట్ల లెక్కింపు రోజు శశిథరూర్ తరపున సీనియర్ పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరించిన వ్యక్తి కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ సమయంలో తప్పులు జరిగాయని, యూపీలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని పార్టీ ఎన్నికల సంఘం చైర్మన్ మధుసూదన్ మిస్త్రికి లేఖ రాశారు. తాము మిస్త్రి దృష్టికి తీసుకెళ్లాలని భావించినా ఫలితం లేకపోయింది. అందుకే లేఖ రాశామని థరూర్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ లేఖ మీడియాకు బహిర్గతం కావడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతర్గతంగా రాసిన లేఖ మీడియాకు ఎలా లీకైందని ఆరా తీస్తోంది.

మిస్టర్ థరూర్.. మీరు లేవనెత్తిన అంశాలన్నింటికీ వివరణ ఇచ్చాము. మీరు కూడా మా సమాధానాలపై సంతృప్తి చెందారు. కానీ మీడియా ముందుకు వెళ్లి మాత్రం ఎందుకు విరుద్దమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా డబుల్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారని శశిథరూర్‌ను మిస్త్రి ప్రశ్నించారు. మీ నుంచి వచ్చిన ఆరోపణలన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ కుట్ర చేస్తోందని మీడియా ముందు ఆరోపించడం ఏంటని ఆయన మండిపడ్డారు.

శశిథరూర్, ఆయన బృందం గోరంతలు కొండంతలు చేస్తోందని మధుసూదన్ మిస్త్రి ఆరోపించారు. వారి ఫిర్యాదుపై మేము సైలెంట్‌గా ఉన్నామని, ఎవరికో సపోర్ట్ చేస్తున్నట్లు థరూర్ అంటున్నారు. మేము వారి లేఖను బయటపెట్టలేదు, ఆ విషయాలను బయటకు వెల్లడించలేదు. పార్టీ మంచి కోసమే ఆ పని చేశాము. అంతే కాని ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు అనేది మాత్రం అబద్దం అని మధుసూదన్ మిస్త్రి చెప్పుకొచ్చారు. మీరు ఆరోపించిన విషయాలపై మేము ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసి..ఆ తర్వాత మీడియా ముందుకు వెళ్లి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.

మేం ఓటర్ల లిస్టును నామినేషన్ వేయడానికి రెండు రోజుల ముందుగానే శశిథరూర్ వర్గానికి చూపించాము. అలాగే ఓటర్ లిస్టుతో పాటు వారి టెలిఫోన్ నెంబర్లను కూడా ఇచ్చాము. అయితే 3000 మంది ఫోన్ నెంబ్లర్లను తమకు ఇవ్వలేదని మీరు వెళ్లి మీడియాకు చెప్పారు. ఇది పూర్తిగా అబద్దం. మీకు, ఖర్గేకి ఒకటే లిస్టు, అవే ఫోన్ నెంబర్లు ఇచ్చాము. అందులో ౯,400 సెల్ నెంబర్లు ఉన్నాయి. మాకు అందుబాటులో ఉన్న నెంబర్లనే మీకు ఇచ్చామని మదుసూదన్ మిస్త్రి వెల్లడించారు.

ఓటు ఎవరికైతే వేయాలని అనుకుంటున్నారో ఆ అభ్యర్థి పక్కన '1' అనే గుర్తు వేయాలని సూచించాము. అయితే సీరియల్ నెంబర్ 1 ఖర్గేది కావడంతో మీరు అభ్యంతరం తెలిపారు. అందుకే అభ్యర్థి పక్కన టిక్ గుర్తు పెట్టాలని మార్చాము. ఇక ఇందులో అభ్యంతరం ఏంముంది. మీరు లేవనెత్తిన అంశాలన్నింటినీ మేము సరి చేశాము. కానీ మీడియా దగ్గర మాత్రం పార్టీకి చెడ్డ పేరు తెల్చేలా వ్యాఖ్యానించారని మిస్త్రి మండిపడ్డారు. కాగా, ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్‌గా ఉంది. కానీ, ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం లేనట్లుగా తెలుస్తున్నది.

First Published:  20 Oct 2022 1:57 PM GMT
Next Story