Telugu Global
National

ఒడిశా రైలు ప్ర‌మాదం.. ప‌రిహారం కోసం మృత‌దేహాలతో స‌రికొత్త మోసాలు

ప్రభుత్వం అందించే పరిహారాన్ని పొందేందుకు నకిలీ ధ్రువపత్రాలతో మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ ఎవరూ గుర్తించని మృతులను తమ కుటుంబ సభ్యులుగా నమ్మించి అధికారుల నుంచి మృతదేహాలు తీసుకుంటున్నారు.

ఒడిశా రైలు ప్ర‌మాదం..  ప‌రిహారం కోసం మృత‌దేహాలతో స‌రికొత్త మోసాలు
X

ఒడిశాలో జ‌రిగిన రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఇంకా అనేక‌మంది మృత‌దేహాల‌ను గుర్తించాల్సి ఉంది. దీంతో ఆయా మృత‌దేహాల భ‌ద్ర‌త కూడా ప్ర‌భుత్వానికి స‌వాలుగా మారింది. మ‌రోప‌క్క మృతులు, గాయ‌ప‌డి వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివ‌రాల‌ను భార‌తీయ రైల్వే ప్ర‌త్యేక వెబ్‌సైట్‌లో ఉంచింది.

సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టుగా ప‌లువురు దురాశప‌రులు బాధితుల కుటుంబ‌స‌భ్యుల‌కు క‌డ‌సారి చూపు ద‌క్క‌నీయ‌కుండా చేస్తున్నారు. ప్రభుత్వం అందించే పరిహారాన్ని పొందేందుకు నకిలీ ధ్రువపత్రాలతో మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ ఎవరూ గుర్తించని మృతులను తమ కుటుంబ సభ్యులుగా నమ్మించి అధికారుల నుంచి మృతదేహాలు తీసుకుంటున్నారు. ఈ నయా మోసాన్ని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ పరిహారం పొందేందుకు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒడిశా రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ జెనా.. రైల్వే అధికారులు, ఒడిశా పోలీసులను ఆదేశించారు.

మోసం బయటపడిందిలా..

కటక్‌కు చెందిన గీతాంజలి దత్తా అనే మహిళ ఆదివారం బాలాసోర్ లోని మృతుల ఫొటోలను ఉంచిన ప్రదేశానికి వచ్చింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణించాడని, అతని ఆచూకీ తెలియడంలేదని పోలీసులకు తెలిపింది. దీంతో అక్క‌డ‌ ఫొటోలో తన భర్త ఆచూకీ ఉందేమో చూడాలని పోలీసులు ఆమెకు సూచించారు. కొన్ని ఫొటోలను చూసిన తర్వాత ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ.. అతడే తన భర్త అని చెప్పింది. అయితే, ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన పోలీసులు, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లో విచారించగా.. ఆమె భర్త బతికే ఉన్నాడని తెలిసింది. దీంతో గీతాంజలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసు విచారణలో అంగీకరించింది.

First Published:  7 Jun 2023 2:02 AM GMT
Next Story