Telugu Global
National

పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు.

పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం
X

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు హాజ‌రై బస్సులో తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. బ్రహ్మపురకు చెందిన ఓ యువతికి ఆదివారం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నవ వధువును ఆమె కుటుంబ సభ్యులు అత్తవారింటిట్లో సాగ‌నంపేందుకు వెళ్లారు. అక్కడ వరుడు ఇంట్లో రాత్రి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం వధువు కుటుంబ సభ్యులు ఒక ప్రైవేటు బస్సులో తిరిగి సొంతూరికి బయలుదేరారు.

సోమవారం తెల్లవారుజామున ఆ బస్సు బ్రహ్మపుర, తప్తపాణి రోడ్డులో వెళ్తూ దిగపహండి ప్రాంతం వద్ద ఎదురుగా వచ్చిన ఓపీఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొంది. ప్రమాదంలో రెండు బస్సులు ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలంలోనే 11 మంది దుర్మరణం చెందారు. 8 మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఎక్కువమంది ప్రైవేట్ బస్సులోని వారే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. మృతుల్లో వధువు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. పెళ్లి తంతు ముగించుకొని సంబరాల్లో ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కాగా, ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున‌ పరిహారం అందిస్తామని ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

First Published:  26 Jun 2023 5:53 AM GMT
Next Story