Telugu Global
National

భారత్ లో జైళ్ల ఆక్యుపెన్సీ రేటు 122 శాతం

జైలు అంటేనే శిక్ష, అందులో ఇరుక్కుని ఉండటం మరో శిక్ష. ఇలా భారత్ లో ఖైదీలు దుర్భర జీవితం అనుభవిస్తున్నారని ఆ కమిటీ తేల్చింది. అత్యధికంగా జిల్లా జైళ్లలో ఆక్యుపెన్సీరేటు 148 గా ఉంది. అంటే అక్కడ ఖైదీలు ఇంకెంత దారుణ పరిస్థితుల్లో ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

భారత్ లో జైళ్ల ఆక్యుపెన్సీ రేటు 122 శాతం
X

అప్పుడప్పుడు ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు ప్రకటిస్తుంది. అది ఎంత ఎక్కువగా ఉంటే, సంస్థకు అంత ఎక్కువ లాభాలన్నమాట. ఆ సంగతి పక్కనపెడితే భారత్ లో జైళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1341 సెంట్రల్‌ జైళ్లు, 644 సబ్‌ జైళ్లు, 402 జిల్లా జైళ్లలో 122 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉందని జైలు సంస్కరణలకోసం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ పేర్కొంది. అంటే 100 మంది ఉండాల్సిన జైలులో 122మంది సర్దుకుపోయి ఉంటున్నారు. జైలు అంటేనే శిక్ష, అందులో ఇరుక్కుని ఉండటం మరో శిక్ష. ఇలా భారత్ లో ఖైదీలు దుర్భర జీవితం అనుభవిస్తున్నారని ఆ కమిటీ తేల్చింది. అత్యధికంగా జిల్లా జైళ్లలో ఆక్యుపెన్సీరేటు 148 గా ఉంది. అంటే అక్కడ ఖైదీలు ఇంకెంత దారుణ పరిస్థితుల్లో ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

కారణం ఏంటి..?

జనాభా పెరుగుతుండే సరికి దానికి తగ్గట్టుగానే నేరాలు, నేరస్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. అదే సమయంలో జైళ్ల సంఖ్య ఆ స్థాయిలో పెరగడంలేదు. ఇది అన్ని వ్యవస్థల్లోనూ ఉన్న సమస్యే. అయితే జైళ్ల విషయంలో మరో తప్పుకూడా జరుగుతోందని సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ తేల్చింది. చిన్న కేసులకు కూడా న్యాయస్థానాలు జైలు శిక్షలు వేయడాన్ని ఆ కమిటీ తప్పుపట్టింది. ప్రత్యామ్నాయాలు ఉన్నా కూడా నిర్బంధం వైపు కోర్టులు మొగ్గు చూపడం సరికాదని పేర్కొంది. దర్యాప్తు, విచారణ ప్రక్రియల్లో జరుగుతున్న మితిమీరిన ఆలస్యం కూడా దీనికి పరోక్ష కారణం అని తేల్చింది. అందుకే భారత్ లో జైళ్లు కిటకిటలాడుతున్నాయని నివేదికలో పేర్కొంది. కేసుల విచారణ వేగవంతమైతేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపింది కమిటీ.

దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న పరిస్థితులపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు 2018లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అమితవ రాయ్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా తన నివేదికను సమర్పించింది. విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా మగ్గిపోతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోందని కమిటీ తెలిపింది. ఆ సంఖ్యను అదుపులో ఉంచాలంటే న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పింది. జైళ్లలో ఆత్మహత్యలపై కూడా కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది.

First Published:  1 Sep 2023 3:09 AM GMT
Next Story