Telugu Global
National

మోడీ సర్కార్ పెగాసస్‌ను కొన్నది నిజమేనా..?

ఈ డీల్‌లో పెగాసస్ వినియోగానికి అవసరమైన పరికరాలను కూడా సరఫరా చేసినట్టు ఇజ్రాయిల్ అంగీకరించిందని ఓసీసీఆర్పీ రిపోర్టు చెబుతోంది. 2017 ఏప్రిల్‌ 18న ఎన్‌ఎస్‌వో గ్రూప్ నుంచి ఢిల్లీలోని ఐబీ కార్యాలయానికి కార్గో విమానంలో పరికరాలు వచ్చాయి..

మోడీ సర్కార్ పెగాసస్‌ను కొన్నది నిజమేనా..?
X

పెగాసస్‌పై ఆర్గనైజ్డ్‌ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్- ఓసీసీఆర్పీ నివేదికలో కీలక అంశాలున్నాయి. మోడీ ప్రభుత్వం పెగాసస్‌ నిఘా వ్యవస్థను కొనుగోలు చేసినట్టుగా ఆ నివేదిక చెబుతోంది. ఇండియన్ ఆర్మీకి ఎయిర్‌ డిఫెన్స్ మిసైల్స్‌ సరఫరా చేసేందుకు మోడీ సర్కారు ఇజ్రాయెల్ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌తో 2017లో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం విలువ 15 వేలకోట్లు కాగా.. డీల్‌ ఈ ఏడాది ప్రారంభంతో ముగిసింది.

ఈ డీల్‌లో పెగాసస్ వినియోగానికి అవసరమైన పరికరాలను కూడా సరఫరా చేసినట్టు ఇజ్రాయిల్ అంగీకరించిందని ఓసీసీఆర్పీ రిపోర్టు చెబుతోంది. 2017 ఏప్రిల్‌ 18న ఎన్‌ఎస్‌వో గ్రూప్ నుంచి ఢిల్లీలోని ఐబీ కార్యాలయానికి కార్గో విమానంలో పరికరాలు వచ్చాయి.. అందులో పెగాసస్‌ వినియోగానికి వాడే కీలకమైన పరికరాలు ఉన్నట్టుగా రిపోర్ట్‌ వెల్లడించింది. పెగాసస్‌ కు సంబంధించిన హార్డ్‌వేర్‌ను ఐబీ తీసుకున్నట్టు కొన్ని డెలివరీ రశీదులను కూడా ఓసీసీఆర్పీ రిపోర్టు బయటపెట్టింది.

అయితే ఇలా దిగుమతి చేస్తున్న పరికరాల సాయంతోనే పెగాసస్‌ను ఉపయోగించారో.. లేదో తెలియాల్సి ఉందని ఆ రిపోర్టు వెల్లడించింది. అదే సమయంలో 2017లో మోడీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసినట్టు ఐబీ అధికారులు కొందరు ధృవీకరించారని ఓసీసీఆర్పీ చెబుతోంది. ఇప్పటికే పెగాసస్‌పై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని అత్యున్న‌త న్యాయ‌స్థానం నియమించింది. గత ఏడాది ఆగస్టులో నివేదిక ఇచ్చిన కమిటీ.. కొందరి ఫోన్లలో మాల్‌వేర్‌ను గుర్తించామని.. అయితే అది పెగాసస్సా..? కాదా.. అన్నది తేల్చాల్సి ఉందని చెప్పింది. పెగాసస్‌పై దర్యాప్తున‌కు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని కూడా ఆ కమిటీ అప్పట్లో ఆరోపించింది.

First Published:  21 Oct 2022 3:02 AM GMT
Next Story