Telugu Global
National

ఎన్‌టీఏ కీల‌క నిర్ణ‌యం.. ఆ అమ్మాయిల‌కు మ‌ళ్లీ ప‌రీక్ష‌

సెప్టెంబ‌రు 4న వారికి ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఎన్‌టీఏ పేర్కొంది. దీనిపై సంబంధిత విద్యార్థినుల‌కు ఈ - మెయిల్ ద్వారా స‌మాచారం పంపిన‌ట్టు వెల్ల‌డించింది.

ఎన్‌టీఏ కీల‌క నిర్ణ‌యం.. ఆ అమ్మాయిల‌కు మ‌ళ్లీ ప‌రీక్ష‌
X

జాతీయ ప‌రీక్ష‌ల మండ‌లి(ఎన్‌టీఏ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది జూలై 17న నీట్ ప‌రీక్ష‌కు హాజ‌రైన విద్యార్థినుల‌తో లోదుస్తులు విప్పించిన వివాదం కేర‌ళ‌లో చోటుచేసుకున్న విష‌యం విదిత‌మే. బాధిత విద్యార్థినుల‌కు మ‌ళ్లీ ప‌రీక్ష రాసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు ఎన్‌టీఏ తాజాగా ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌రు 4న వారికి ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్టు పేర్కొంది. దీనిపై సంబంధిత విద్యార్థినుల‌కు ఈ - మెయిల్ ద్వారా స‌మాచారం పంపిన‌ట్టు వెల్ల‌డించింది.

నీట్ ప‌రీక్ష స‌మ‌యంలో త‌మ‌ను లోదుస్తులు విప్పాల‌ని ప‌రీక్ష సిబ్బంది ఒత్తిడి చేశారంటూ కొంద‌రు విద్యార్థినులు అప్ప‌ట్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్య‌వ‌హారం పెను దుమారం రేపింది. కేర‌ళ రాష్ట్రం కొల్లం జిల్లా ఆయుర్‌లోని మార్ధోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో నిర్వ‌హించిన ప‌రీక్ష సంద‌ర్భంగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. దీనిపై ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. త‌నిఖీల స‌మ‌యంలో లోదుస్తుల‌కు ఉన్న హుక్స్ కార‌ణంగా శ‌బ్దం వ‌చ్చింద‌ని, దీంతో దానిని తొల‌గించి ప‌రీక్ష‌కు వెళ్లాల‌ని త‌న కుమార్తెను సిబ్బంది ఆదేశించార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు అనంత‌రం మ‌రికొంద‌రు విద్యార్థినులు కూడా ఇదే త‌ర‌హా ఫిర్యాదులు చేశారు.

అప్ప‌ట్లో ఈ వ్య‌వ‌హారంపై తీవ్ర వివాదం రేగింది. ప‌లు విద్యార్థి సంఘాల నేత‌లు దీనిపై ఆందోళ‌న‌లకు దిగారు. విద్యార్థినుల‌తో అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించిన క‌ళాశాల సిబ్బందిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అప్ప‌ట్లో ఈ ఫిర్యాదులపై ఎన్‌టీఏ స్పందిస్తూ.. ఇవి దురుద్దేశంతో కూడుకున్న‌వ‌ని బుకాయించింది. ఆ త‌ర్వాత దీనిపై నిజ నిర్ధార‌ణ క‌మిటీని నియ‌మించింది. ఆ త‌ర్వాత ఈ త‌నిఖీల్లో పాల్గొన్న ఐదుగురు సిబ్బందిని కేర‌ళ పోలీసులు అరెస్టు చేశారు.

First Published:  27 Aug 2022 7:10 AM GMT
Next Story