Telugu Global
National

అదానీనే కాదు..అంబానీ, జై షాల‌నూ స్వాగ‌తిస్తాం... గెహ్లాట్‌

అదానీపై రాజస్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లెట్ ప్రశంసించడాన్ని బీజేపీ విమర్శించిన నేపథ్యంలో గెహ్లెట్ స్పందించారు. రాజస్థాన్ లో పెట్తుబడులు పెట్టడానికి తాను అదానీనే కాదు అంబానీ, జై షాలను కూడా స్వాగ‌తిస్తానని ఆయన అన్నారు.

అదానీనే  కాదు..అంబానీ, జై షాల‌నూ స్వాగ‌తిస్తాం... గెహ్లాట్‌
X

'ఇన్వెస్ట్ రాజస్థాన్ సమ్మిట్' సందర్భంగా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ప్రశంసలు కురిపించిన తర్వాత కాంగ్రెస్‌ను బిజెపి ఎగతాళి చేయ‌డాన్ని రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించారు. తాను ఆదానీని ప్రేవేటు కార్య‌క్ర‌మంలో క‌లుసుకుని పొగ‌డ‌లేద‌ని ఈ స‌ద‌స్సుకు 3,000 మంది ప్రతినిధులు హాజరయ్యారని అన్నారు. వీరంతా కాంగ్రెస్ కు చెందిన వారా..? అని ప్ర‌శ్నించారు. వారు ఏ పార్టీ వారైనా, ఏ సిద్ధాంతాలు ఆచ‌రిస్తున్న వారైనా పారిశ్రామిక‌వేత్త‌లే అన్నారు.

అదానీ అయినా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షా అయినా, ముఖేష్ అంబానీ అయినా రాజస్థాన్ లో పెట్టుబడులు, ఉపాధిని కోరుకుంటున్నందున అందరినీ స్వాగతిస్తామ‌ని గెహ్లాట్ అన్నారు. "అటువంటి పరిస్థితిలో, వారు (బిజెపినాయ‌కులు) ఎందుకు అడ్డంకులు సృష్టించాలనుకుంటున్నారు? నేను వారి వ్యాఖ్య‌ల‌ను విమ‌ర్శ‌ల‌ను ఖండిస్తున్నాను. అని అన్నారు.

అయితే ఇక్క‌డ స్ప‌ష్ట‌త లేని విష‌య‌మేంటంటే..పారిశ్రామిక వేత్త‌లు ఆదానీ, అంబానీల తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా పేరును ఎందుకు ప్ర‌స్తావించార‌ని చ‌ర్చ న‌డుస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేవలం బడా వ్యాపారులకు మాత్రమే సహాయం చేస్తారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తరచుగా అదానీని విమ‌ర్శిస్తుంటారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'ఇన్వెస్ట్ రాజస్థాన్' ప్రారంభోత్సవ వేడుకలో అదానీ గ్రూప్ చైర్మన్, ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన అదానీ గెహ్లాట్ పక్కనే కూర్చున్నారు. గెహ్లాట్ తన ప్రసంగంలో, వ్యాపార దిగ్గజం "గౌతమ్ భాయ్" అని సంబోధించారు. ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి గా నిలిచినందుకు అభినందనలు తెలిపారు.

దీనిపై బిజెపి నేత‌లు గెహ్లాట్ ను విమ‌ర్శిస్తూ.. ఎప్పుడూ న‌రేంద్ర‌మోడీని, కేంద్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే ముఖ్య‌మంత్రి నేడు పెట్టుబ‌డుల కోసం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ అధిష్టానానికి చెంప‌దెబ్బ అని విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. అయితే ఇదే సంద‌ర్భంలో రాహుల్ గాంధీ మాత్రం పేర్లు ప్ర‌స్తావింవ‌చ‌కుండా ట్విట్టర్లో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. పెట్టుబడిదారీ స్నేహితుల కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేశారని, మరికొందరు అప్పుల పాల‌య్యారని ఆరోపించారు.

10,000-మెగావాట్ల సోలార్ పవర్ సౌకర్యం ఏర్పాటు, సిమెంట్ ప్లాంట్ విస్తరణ, జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్‌గ్రేడేషన్‌తో సహా రాబోయే ఐదు నుండి ఏడు సంవత్సరాల్లో రాజస్థాన్‌లో రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పారిశ్రామికవేత్త గౌత‌మ్ ఆదానీ ప్రకటించిన విష‌యం తెలిసిందే.

First Published:  9 Oct 2022 7:14 AM GMT
Next Story