Telugu Global
National

క‌బుర్లు కాదు..ప‌నిచేయ‌డ‌మే నాకిష్టం : థ‌రూర్ వ్యాఖ్య‌ల‌పై ఖ‌ర్గే

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ లు ప్రచారం తీవ్రతరం చేశారు. అభ్య‌ర్ధుల మ‌ధ్య‌ బ‌హిరంగ చ‌ర్చ జరగాలని థరూర్ డిమాండ్ చేయగా ఖర్గే దాన్ని తిరస్కరించారు.

క‌బుర్లు కాదు..ప‌నిచేయ‌డ‌మే నాకిష్టం : థ‌రూర్ వ్యాఖ్య‌ల‌పై ఖ‌ర్గే
X

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌లు ఓ ప్ర‌హ‌స‌నంగా మారాయి. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే కు అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతున్నా అభ్య‌ర్ధులు ఎవ‌రినీ అధికారికంగా నిల‌బెట్ట‌లేద‌ని చెప్పుకోవ‌డం హాస్యాస్ప‌దంగా ఉంటుంది. ఇది శ‌త్రువ‌ర్గాల మ‌ద్య పోటీ కాదు స్నేహ‌పూర్వ‌క పోటీ అంటూనే బరిలో ఉన్న థ‌రూర్, ఖ‌ర్గేలు ప‌రోక్షంగా పోటీని ర‌క్తి క‌ట్టిస్తున్నారు. అభ్య‌ర్ధుల మ‌ధ్య‌ బ‌హిరంగ చ‌ర్చ జ‌రిగితే పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌లలో ఆస‌క్తి రేకెత్తుతుంద‌ని, అందుకు తాను సిద్ధ‌మేన‌ని థ‌రూర్ అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఖ‌ర్గే స్పందిస్తూ.. "థ‌రూర్ నా త‌మ్ముడు వంటి వాడు. ఇద్ద‌రం ఒకే కుటుంబానికి ( కాంగ్రెస్‌) చెందిన వాళ్ళం. అలాంట‌ప్పుడు చ‌ర్చ జ‌ర‌గ‌డంలో అర్ధం లేద‌ని" అన్నారు. ఇదే సంద‌ర్భంలో .. "ఇటువంటి అన‌వ‌స‌ర విష‌యాల్లోకి వెళ్ళ‌డం నాకిష్టం లేదు.. నాకు పని చేయడం మాత్రమే తెలుసు, అందుకు అవకాశం ఇవ్వండి'' అని ఖ‌ర్గే అన్నారు. " ఇది మా మ‌ధ్య ఒక‌రిపై ఒక‌రి పోరాటం కాదు.. మా ఇద్ద‌రి పోరాటం బిజెపి పైనే.. మా దృష్టి అంతా దానిపైనే" అన్నారు.

నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ సభ్యుల హృదయాల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని థరూర్ అన్నారు. ఇదే విష‌యాన్ని మ‌రో ర‌కంగా ఖ‌ర్గే వ్యాఖ్యానిస్తూ.. తాను పార్టీ అధినేత అయితే, గాంధీ కుటుంబాన్ని, ఇతర సీనియర్ నేతలను సంప్రదించి, వారు సూచించిన మంచి విషయాలను అమలు చేస్తానని ఖర్గే చెప్పారు, అయితే గాంధీల మద్దతు ఉన్న "అధికారిక అభ్యర్థి" తానేనన్న ఆరోపణలను తిరస్కరించారు. ఏకాభిప్రాయ అభ్యర్థి అయితే మంచిదని తాను థరూర్‌తో చెప్పానని, అయితే "ప్రజాస్వామ్యం కోసం" పోటీ ఉండాల్సిందేన‌ని ఆయ‌న పట్టుబట్టారని ఖర్గే చెప్పారు.

పార్టీలో జి-23 అంటూ లేద‌ని, అంతా క‌లిసి బిజెపికి వ్య‌తిరేకంగా జ‌రిపే పోరాటంలో త‌నతో క‌లిసి వ‌స్తున్నారని చెప్పారు. బిసి హుడా,ఆనంద‌శ‌ర్మ మ‌నీష్ తివారీ వంటి నాయ‌కులు ఇప్పుడు ఖ‌ర్గేకు మ‌ద్ద‌తునిస్తున్నారు. రెండేళ్ళ‌ క్రితం పార్టీలో ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాలంటూ సోనియా గాంధీకి లేఖ రాసిన వారిలో వీరితో పాటు థ‌రూర్ కూడా ఉన్నారు. అయినా ఇప్పుడు వారంతా ఖ‌ర్గేకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం విశేషం.

First Published:  3 Oct 2022 7:46 AM GMT
Next Story