Telugu Global
National

సస్పెన్స్‌కు తెర.. ఆర్మీ పరేడ్‌కు ఫ్యామిలీతో కిమ్ హాజరు

ఉత్తర కొరియాలో ప్రస్తుతం కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో జరిపే పరేడ్‌లో కిమ్ పాల్గొనక పోవడం, అంత ముందు జరిగిన ముఖ్య సమావేశాలకు కూడా హాజరు కాకపోవడంతో ఆయన ఆరోగ్యం విషమించిందని అమెరికాలోని ముఖ్య మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

సస్పెన్స్‌కు తెర.. ఆర్మీ పరేడ్‌కు ఫ్యామిలీతో కిమ్ హాజరు
X

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి ఏమైంది.. అన్న ప్రశ్న గత కొన్నిరోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా నడిచింది. దానికి కారణం 40 రోజులకు పైనుంచి ఆయన బాహ్య ప్రపంచంలో కనిపించకపోవడమే. కిమ్ అజ్ఞాతంలో ఉన్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఇక అమెరికా మీడియా అయితే కిమ్ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఆయన బయట కనిపించడం లేదని వరుసపెట్టి వార్తలు ప్రసారం చేసింది. కిమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా కథనాలు ప్రచురించాయి.

ఉత్తర కొరియాలో ప్రస్తుతం కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో జరిపే పరేడ్‌లో కిమ్ పాల్గొనక పోవడం, అంత ముందు జరిగిన ముఖ్య సమావేశాలకు కూడా హాజరు కాకపోవడంతో ఆయన ఆరోగ్యం విషమించిందని అమెరికాలోని ముఖ్య మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ బుధవారం ఆర్మీ నిర్వహించిన పరేడ్‌లో కిమ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఈ వేడుకలకు కిమ్ భార్య రీ సోల్ జూ, ఆయన కుమార్తె జూ యే కూడా హాజరయ్యారు. నిజానికి కిమ్ తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. కుటుంబంతో కలిసి బయట కనిపించడం అరుదు. అసలు ఆయనకు ఎంతమంది సంతానం అన్నది కూడా ఎవరికీ చెప్పరు. ఇప్పుడు వేడుకల్లో పాల్గొన్న కిమ్ కుమార్తె జూ యే ఆమె పుట్టిన తర్వాత బయట కనిపించడం ఇది రెండోసారి మాత్రమే. కొంతకాలం కిందట జరిగిన ఓ మిసైల్‌ పరీక్షకు కుమార్తెతో కలిసి కిమ్ హాజరు అయ్యారు. అయితే అప్పుడు కిమ్ కుమార్తె ఫొటోలు కూడా మీడియా వరకు రాలేదు.

ఇప్పుడు కిమ్ తన కుమార్తెను ఆర్మీ పరేడ్‌కు తీసుకురావడమే కాక బాంక్వెట్‌లో టేబుల్ సెంటర్ సీటులో తన కూతురిని కూర్చోబెట్టారు. దీని ద్వారా తన తదనంతరం తన కుమార్తె జూ యే దేశానికి కాబోయే అధినేత అని కిమ్ జోంగ్ ఉన్ పరోక్షంగా వెల్లడించారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా 40 రోజుల తర్వాత బయట ప్రపంచంలోకి వచ్చిన కిమ్ తన ఆరోగ్యం పట్ల విష ప్రచారం చేస్తున్న అమెరికాకు పెద్ద షాక్ ఇచ్చారు.

First Published:  8 Feb 2023 11:34 AM GMT
Next Story