Telugu Global
National

కుక్క కాటుకి జరిమానా దెబ్బ..

పెంపుడు కుక్కల్ని రోడ్డుపైకి వదిలినా, ఆ కుక్కలు ఎవరినైనా కరిచినా 10వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సిందే. అంతే కాదు, కుక్కకాటు బాధితుడి వైద్య ఖర్చులన్నీ యజమాని భరించాల్సిందే.

కుక్క కాటుకి జరిమానా దెబ్బ..
X

పెంపుడు కుక్కలు ఎవరినైనా కరిస్తే ఏం చేస్తారు. యజమానులతో గొడవ పడతారు, లేదా నష్టపరిహారం వసూలు చేసుకుంటారు. కానీ అన్ని సందర్భాల్లో ఇది వర్కవుట్ కాదు, చాలా సార్లు కుక్కల యజమానులే బాధితులపై తిరగబడే ఉదాహరణలున్నాయి. ఇకపై అలాంటివి కుదరదు. పెంపుడు కుక్కల్ని ఇంట్లోనే కట్టేసుకోవాల్సిన బాధ్యత యజమానులదే. కాదని రోడ్డుపైకి వదిలినా, ఆ కుక్కలు ఎవరినైనా కరిచినా 10వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సిందే. అంతే కాదు, కుక్కకాటు బాధితుడి వైద్య ఖర్చులన్నీ యజమాని భరించాల్సిందే. నొయిడా కార్పొరేషన్ ఈ కొత్త నిబంధన అమలులోకి తెచ్చింది.

ఇటీవల నొయిడాలో కుక్క కాటు కేసుల సంఖ్య భారీగా పెరిగింది. పోనీ వీధి కుక్కల్ని నిర్మూలించినా ఈ కేసులు మాత్రం తగ్గలేదు. చాలాచోట్ల పెంపుడు కుక్కలే వీధుల్లోకి వచ్చినప్పుడు రోడ్డునపోయేవారిపై దాడి చేస్తున్నాయని తేలింది. వాటిని కంట్రోల్ లో పెట్టుకోలేని యజమానులు, బాధితులపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇలాంటి కేసుల విషయంలో జరిమానా అస్త్రాన్ని బయటకు తీశారు నొయిడా కార్పొరేషన్ అధికారులు. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తామన్నారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి..

పెంపుడు కుక్కల కోసం నొయిడా కార్పొరేషన్ ఓ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ లో యజమానులు వారి కుక్కల వివరాలు నమోదు చేయాలి, వాటి ఫొటోలు అప్ లోడ్ చేయాలి. వాటికి టీకాలు వేయించారా.. లేదా పొందుపరచాలి. ఒకవేళ టీకాలు వేయించకపోయినా కూడా జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ యాప్ లో రిజిస్టర్ కాకుండా ఎవరైనా తమ కుక్కని కొట్టారని, దాడి చేశారని వచ్చినా పోలీసులు కేసు పెట్టరు. బదులుగా యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోనందుకు, కుక్కల్ని వీధుల్లో వదిలిపెడుతున్నందుకు వారి వద్దే జరిమానా వసూలు చేస్తారు. మొత్తమ్మీద పెంపుడు కుక్కల బెడదకు జరిమానాతో పరిష్కారం కనిపెట్టారు నొయిడా అధికారులు.

First Published:  14 Nov 2022 8:30 AM GMT
Next Story