Telugu Global
National

బెంగుళూరును ముంచెత్తిన వర్షాలు... రెండు రోజులు మంచి నీళ్లు బంద్

భారీ వర్షాలతో బెంగుళూరు అతలాకుతలం అవుతోంది. నగరానికి మంచినీటిని సప్లయ్ చేసే పంపింగ్ స్టేషన్ పూర్తిగా నీట మునగడంతో.. రెండు రోజులపాటు నీటి సరఫరా ఉండదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

బెంగుళూరును ముంచెత్తిన వర్షాలు... రెండు రోజులు మంచి నీళ్లు బంద్
X

కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా బెంగుళూరు సిటీ తడిసి ముద్దవుతోంది. సిటీలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మాండ్యా జిల్లా నుంచి ఈ నగరానికి మంచినీటిని సప్లయ్ చేసే పంపింగ్ స్టేషన్ పూర్తిగా నీట మునగడంతో.. రెండు రోజులపాటు నీటి సరఫరా ఉండదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సిటీలో సుమారు 50 కి పైగా ప్రాంతాలకు ఈ సమస్య తప్పదని బెంగుళూరు వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు వెల్లడించింది. కావేరీ నది నుంచి వచ్చే నీటిని మాండ్యాలోని పంపింగ్ స్టేషన్ శుద్ధి చేసి నగరానికి సరఫరా చేస్తుందని, కానీ అది నీటిలో మునిగిందని ఈ సంస్థ పేర్కొంది. రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై.. మాండ్యాలోని టీ.కె. హళ్లిని విజిట్ చేసి.. దీని పరిస్థితిని సమీక్షిస్తారని తెలుస్తోంది.

నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల సుమారు మూడు నుంచి 4 అడుగుల వరకు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోనివారి అవస్థలు వర్ణనాతీతం. సుమారు 30 ఏరియాల్లో బోట్లను వినియోగిస్తున్నారు. జూన్ 1 న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరంలో సగటున 141 శాతానికి పైగా వర్షపాతం నమోదయింది. వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా.. కొన్ని ప్రైవేటు సంస్థలు ఇళ్ల నుంచే పని చేయవలసిందిగా తమ సిబ్బందికి సూచించాయి. వీటిలో ఐటీ కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి. అనేక స్కూళ్లకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.

ఐటీ సంస్థలకు సుమారు 225 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారని, దీనిపై పరిహారం, తదితర అంశాలపై తాము చర్చిస్తామని సీఎం బొమ్మై తెలిపారు. గత జులై నెలలో కూడా వరదలు, వర్షాలతో కర్ణాటక తల్లడిల్లింది. కేంద్రం తమ రాష్ట్రానికి సాయం చేయాలనీ బొమ్మై కోరారు. ఇప్పుడు మళ్ళీ ఈ భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బెంగుళూరు నగరానికి రెండు రోజులపాటు నీటి సరఫరా ఉండదని మొదటిసారిగా ప్రకటించారు.




First Published:  5 Sep 2022 1:59 PM GMT
Next Story