Telugu Global
National

పోస్టర్లు, బ్యానర్లు లేకుండా ఎన్నికలా..?

ఈసారి ఎన్నికల్లో మాత్రం తన పేరుతో ఒక్క పోస్టర్ కానీ, బ్యానర్ కానీ నియోజకవర్గంలో కనిపించదని అంటున్నారు గడ్కరీ. తనకు ఓటు వేయాలనుకున్న వాళ్లు వేస్తారని, ఇష్టం లేనివాళ్లు వేయరని చెప్పారు.

పోస్టర్లు, బ్యానర్లు లేకుండా ఎన్నికలా..?
X

పోస్టర్లు, బ్యానర్లు, రోడ్ షో లు, బహిరంగ సభలు... ఎన్నికలంటే ఇవన్నీ కామన్. వీటికి తోడు ఇప్పుడు సోషల్ మీడియా టీమ్, వాట్సప్ మెసేజ్ లు, ఇలా రకరకాల కొత్త ప్రచారాస్త్రాలు చేరాయి. కానీ ఇవేవీ తనకు అక్కర్లేదంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పోస్టర్లు, బ్యానర్లు లేకుండానే ఈసారి తన ప్రచారం ఉంటుందని, ఒక్క బ్యానర్ కూడా తన నియోజకవర్గంలో కట్టకుండానే తాను ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో విజయం కోసం పోస్టర్లు, బ్యానర్లపై కాకుండా సేవా రాజకీయాలపై ఆధారపడతానని చెప్పారు నితిన్ గడ్కరీ. వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఎలాంటి పోస్టర్లు అంటించబోనని.. తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని ప్రజల్ని కోరతానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకు పోలయ్యే ఓట్ల సంఖ్యను కూడా పెంచుకుంటానని ధీమా వ్యక్తం చేశారు గడ్కరీ.

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నితిన్ గడ్కరీ. గతంలో వరుసగా రెండు దఫాలు ఆయన అక్కడినుంచే గెలుపొందారు. గతంలో తనకు విజయం కష్టమని చాలామంది చెప్పారని, కానీ తాను పట్టుదలతో పోటీ చేసి గెలిచానన్నారు. వచ్చే దఫా మెజార్టీ మరింత పెంచుకుంటానన్నారు.

అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం తన పేరుతో ఒక్క పోస్టర్ కానీ, బ్యానర్ కానీ నియోజకవర్గంలో కనిపించదని అంటున్నారు గడ్కరీ. తనకు ఓటు వేయాలనుకున్న వాళ్లు వేస్తారని, ఇష్టం లేనివాళ్లు వేయరని చెప్పారు. సేవా రాజకీయాలు, అభివృద్ధి రాజకీయాలు, ప్రజలకు చేసిన మంచి ద్వారా మాత్రమే ఓట్లు లభిస్తాయంటున్నారు గడ్కరీ. అంతే కానీ పోస్టర్లు, బ్యానర్లతో ఓట్లు రావని చెప్పారు.

First Published:  16 May 2023 7:28 AM GMT
Next Story