Telugu Global
National

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదు : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించనున్న ప్రత్యేక లోక్‌సభ సమావేశాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. కానీ వాటిని నేను ఇప్పుడే బయటపెట్టలేనని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదు : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
X

దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఉత్సాహంగా ఉన్నదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ముందస్తు, జమిలీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పదవీ కాలం చివరి రోజు వరకు సేవలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు. ఒక జాతీయ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో లోక్‌సభను రద్దు చేసి బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా 'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' పేరుతో బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దీంతో త్వరలోనే మినీ జమిలీ ఎన్నికలకు బీజేపీ వెళ్తుందని.. లోక్‌సభను రద్దు చేసి ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తి కాలం పని చేస్తుందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఆలస్యం చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల వాయిదా అనే అంశాలు మీడియా సృష్టించిన ఊహాగానాలే అని తేల్చేశారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కోసం వేసిన కమిటీలో కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరి కూడా భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఆశిస్తోందని చెప్పారు.

సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించనున్న ప్రత్యేక లోక్‌సభ సమావేశాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. కానీ వాటిని నేను ఇప్పుడే బయటపెట్టలేనని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ప్రత్యేక సమావేశాల అజెండాను సరైన సమయం వచ్చినప్పుడు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడిస్తారని ఆయన పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇస్తుంది. ఆ తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు.

First Published:  4 Sep 2023 12:22 AM GMT
Next Story