Telugu Global
National

మా రాష్ట్రం పేరు మార్చండి.. - పశ్చిమబెంగాల్‌ సీఎం డిమాండ్‌

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలనేది ఆ రాష్ట్ర సీఎం మమతా డిమాండ్‌. గతంలోనే ఈ విషయంపై తమ రాష్ట్రం నుంచి వివరాలు అందించినా.. పేరు మార్చలేదని ఆమె చెప్పారు.

మా రాష్ట్రం పేరు మార్చండి.. - పశ్చిమబెంగాల్‌ సీఎం డిమాండ్‌
X

తమ రాష్ట్రం పేరును మార్చాలంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. పేరు మార్చాలని కోరుతూ తమ అసెంబ్లీ గతంలోనే బిల్లును ఆమోదించిందని తెలిపారు. దానికి సంబంధించి తాము అన్ని విషయాల్లో స్పష్టత ఇచ్చామని వివరించారు. కోల్‌కతాలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె దీనిపై మాట్లాడారు. సంవత్సరాలు గడిచిపోతున్నా తమ రాష్ట్రం పేరు మార్చకపోవడంపై ఆమె ఈ సందర్భంగా కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఎందుకు మార్చాలంటున్నారంటే...

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌గా ఉన్న పేరును మార్చాలని కోరడం వెనుక ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ చెప్పే కారణమేమిటంటే.. ఇంగ్లిష్‌ అక్షరమాల ప్రకారం.. జాబితాలో తమ రాష్ట్రం పేరు చివరగా ఉంటుందని, దీంతో సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు ఆఖరివరకు వేచి ఉండాల్సి వస్తోందనేది ఆమె అభిప్రాయం. పేరు మారితే.. పలు పోటీల్లో పాల్గొని, చదువుకోవడానికి వెళ్లే పిల్లలకు ప్రాధాన్యం దక్కుతుందని తెలిపారు. లేకపోతే ప్రతి సమావేశంలో చివరివరకు వేచి ఉండాల్సి వస్తోందని చెప్పారు. తమ రాష్ట్రం పేరులో ’వెస్ట్‌’ అని జత చేయాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

ఇంతకీ ఏ పేరుతో మార్చమంటున్నారంటే..

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలనేది ఆ రాష్ట్ర సీఎం మమతా డిమాండ్‌. గతంలోనే ఈ విషయంపై తమ రాష్ట్రం నుంచి వివరాలు అందించినా.. పేరు మార్చలేదని ఆమె చెప్పారు. బాంబే పేరును ముంబయిగా మార్చారని, ఒరిస్సా.. ఒడిశా అయిందని, మరి తమ రాష్ట్రం పేరు ఎందుకు మారడం లేదని ప్రశ్నించారు. తమ తప్పేముందని మమతా నిలదీశారు. 2011లో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం పేరును ’పశ్చిమ బంగ’గా మార్చాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ కోరింది. అయితే ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం మరోసారి ఈ అంశంపై మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు.

First Published:  13 Jan 2024 2:49 AM GMT
Next Story